తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదో తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 5న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం జరుగుతుందని.. కొత్త సచివాలయ భవన సముదాయం, నియంత్రిత సాగు, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఆ రోజున కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో… అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగాల్సి ఉంది. ఈ తేదీని ఖరారు చేసి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం సమాచారం పంపింది. అయితే.. ఈ భేటీ పట్ల కేసీఆర్ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన.. అపెక్స్ కౌన్సిల్ భేటీని ఇరవయ్యో తేదీకి వాయిదా వేయాలని… కేంద్రాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరిస్తుందో లేదో తెలియని పరిస్థితి. అందుకే వ్యూహాత్మకంగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేశారన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమం అని తెలంగాణ అంటోంది. ఈ మేరకు కేంద్రానికి నదీ యాజమాన్య బోర్డులకు ఫిర్యాదులు కూడా చేసింది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో వీటన్నింటినీ బలంగా లేవనెత్తే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏపీ సర్కార్ ముందుకెళ్లవద్దని.. పదే పదే తెలంగాణ సర్కార్ … కేంద్రానికి ఫిర్యాదు చేస్తోంది.
ఇలాంటి సమయంలో.. అపెక్స్ కౌన్సిల్ భేటీలోనే ఆ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తే… పర్మిషన్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే.. విభజన చట్టం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఆమోదం తప్పనిసరి. ఇలాంటి అవకాశాన్ని తెలంగాణ సర్కార్ వదులుకుంటోందని.. విపక్ష నేతలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించారు.