హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ ప్రాంతంలో క్యాంప్ ఆఫీస్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అది ఇరుకుగా ఉండటమే కాకుండా సరైన వసతులు లేవనే కారణంతో సర్వహంగులతో నూతన అధికార నివాసాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికార నివాసం సమీపంలోని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్, క్లబ్ పరిసరాల్లో నూతన భవనాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం మొత్తం 9 ఎకరాలను సమీకరిస్తున్నారు. రు.30 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆర్ అండ్ బీ అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. 9 ఎకరాల్లోని రెండు ఎకరాలను ముఖ్యమంత్రి నివాసానికి కేటాయిస్తారు. మిగిలిన స్థలంలో సిబ్బంది, ఇతర అధికారుల ఇళ్ళకోసం కేటాయిస్తారు. ముఖ్యమంత్రి నివాసంలో 250 నుంచి వేయిమంది కూర్చునేలా హాల్ కూడా నిర్మిస్తారు. 300 వాహనాలు పార్క్ చేసుకునేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉంటున్న క్యాంప్ ఆఫీస్‌కు కేసీఆర్ వాస్తు ప్రకారం కొంత మార్పులు చేయించినప్పటికీ, ఆయనకు ఆ నివాసం వాస్తుపరంగా సంతృప్తికరంగా లేదని గతంలో వార్తలొచ్చాయి. కేసీఆర్‌కు వాస్తుపై బాగా పట్టింపు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సచివాలయం కూడా వాస్తుపరంగా సరిగా లేదని కొన్ని నెలలుగా ఆయన హాజరు కావటంలేదు.