తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే గులాబీ దళం లోకి జారుకుంటున్న కొద్దీ.. రాష్ట్ర పార్టీ నాయకత్వం, సీఎల్పీ నాయకత్వం లోపభూయిష్టంగా ఉన్నదని, వారు ఎమ్మెల్యేలలో భరోసా కల్పించలేకపోతున్నారని.. అందు చేతనే ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని విపరీతంగా విమర్శలు వస్తూనే ఉంటున్నాయి. పైగా అది కాంగ్రెస్ పార్టీ గనుక, అక్కడి నాయకులకు విపరీతమైన అంతర్గత స్వేచ్చా స్వాతంత్య్రాలు ఉంటాయి గనుక.. తాము తలచినదెల్లా అధిష్ఠానానికి ఉత్తరాల రూపంలో రాసేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు అలా పార్టీ మారితే చాలు.. ఫలానా నాయకుల చేతగానితనం వల్ల.. వలసలు పెరుగుతున్నాయంటూ ఢిల్లీకి లేఖలు బనాయించేస్తుంటారు. ఇలాంటి సమయంలో.. సీఎల్పీ భేటీ జరగడం, వారందరూ కలిసి (?) జానారెడ్డి నాయకత్వం పట్ల సంఘీభావం వ్యక్తం చేయడం విశేషం.
నిజం చెప్పాలంటే.. ఇవాళ సీఎల్పీ భేటీ మొత్తం రసాభాసగానే జరిగింది. భేటీలో సీఎల్పీ నాయకుడు జానారెడ్డి కూడా తెరాస తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చర్చకు వచ్చాయి. అయితే ఈ విషయంలో జానారెడ్డి చాలా మనస్తాపానికి గురై ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన బొందిలో ప్రాణం ఉండగా.. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లబోయేది లేదంటూ ఆయన ఉద్వేగంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో కోణంలోంచి గమనించినప్పుడు జానారెడ్డి చాలా కాలంగా రాజకీయ సన్యాసం తరహాలో డైలాగులు సంధిస్తున్నారు. వ్యవహరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు వలసలు వెళ్లిన ప్రతిసారీ కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఆయన వైపే వేలెత్తి చూపడం జరుగుతూ ఉంది.
అయితే ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశం మాత్రం జానారెడ్డి నాయకత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా తీర్మానించింది. వలసలు ఇతరత్రా కారణాల వలన జరుగుతున్నాయని, సీఎల్పీ, పీసీసీ నాయకత్వంలో లోపం లేదని పాల్గొన్న నాయకులు పేర్కొనడం విశేషం. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. అలాంటిది సీఎల్పీ మాత్రం సమావేశంపెట్టుకుని ఇలా తీర్మానించేయడం, ఎమ్మెల్సీలు వచ్చినా కూడా వారిని బయటకు పంపేయడం, కోమటిరెడ్డి వంటి ఎమ్మెల్యేలు కూడా భేటీని బహిష్కరించి వెళ్లడం వంటివి టీకాంగ్రెస్‌లో ఉన్న అరాచకపోకడలకు నిదర్శనాలే. అలాగే వీహెచ్ వంటి రాష్ట్ర నాయకులు కూడా రాష్ట్ర నాయకత్వంపై పదేపదే ధ్వజమెత్తుతున్నారు. అన్ని లుకలుకలు ఉండగా.. ఏదో తాము ఉన్న నాయకులకు మద్దతు ఇచ్చేశాం అన్నట్లుగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేసిన ప్రకటన… టీ కాంగ్రెస్‌ను కాపాడలేకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.