తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నేతా సీరియస్‌గా వ్యవహరించడం లేదు. ఓటమికి సమీక్ష జరిపి … హైకమాండ్‌కు పంపాల్సిన నివేదిక కోసం..నిర్వహిస్తున్న సమావేశాలకు.. ఎవరూ రావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీలో కీలక పదవులు నిర్వహించిన నేతలు సమీక్ష సమావేశాలకు హాజరుకావడం లేదు. రెండు రోజులపాటు గాంధీ భవన్ లో జరిగిన పార్లమెంటు సమీక్ష సమేశాలల్లో 12 పార్లమెంటు నియోజకవర్గ ల సమీక్ష జరిగింది. ఒక్కటంటే.. ఒక్క నియోజకవర్గానికి చెందిన కీలక నేత కూడా వచ్చి… తమ ఓటమికి కారణాలు ఇవని చెప్పలేదు. మొదటిరోజు సమీక్షలకు హాజరుకావాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రాలేదు. రేవంత్ రెడ్డి ,అజారుద్దీన్ సమీక్షలకు రాకుండా దూరంగా ఉన్నారు. అంతే కాదు.. గెలిచిన ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు, గండ్ర వెంకరమణ రెడ్డి సమాచారం ఉన్నా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. మాజీ మంత్రులు సైతం అంటి ముంటనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మంచి ఫలితాలు సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన సమీక్షా సమావేశంలోనూ రగడ జరిగింది. రేణుకా చౌదరి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని.. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ దారిలో తాము పయనించారు. వాళ్ల టార్గెట్ నల్లగొండ పార్లమెంట్ టిక్కెట్ సాధిచుకోవడమే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి హేమహేమీలైన నేతలు ఉన్నా… ఎవరూ సమీక్షలకు రావడం లేదు. సంపత్, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, వంశీకృష్ణ, జైపాల్ రెడ్డి సమావేశాలకు హాజరు కాలేదు.పార్లమెంట్ ఇంచార్జ్ లు సురేష్ షెట్కార్ , మధుయాష్కీ గౌడ్ సమీక్షలకు డుమ్మా కొట్టారు. జగ్గారెడ్డి, గీతా రెడ్డి,అరెపల్లి మోహన్,కొండ సురేఖ,గండ్ర వెంకటరమణ రెడ్డి,దొంతి మాధవ రెడ్డి,ప్రతాప్ రెడ్డి లు సమీక్షలకు దూరంగా ఉన్నారు.
అయితే ఎన్నికల ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా కుంతియా,ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి మెజార్టీ పార్టీ నేతల్లో ఉంది. అందుకే ఆ నేతల పైన ఉన్న అసంతృప్తి తోనే సమీక్ష సమావేశాలకు మెజార్టీ నాయకులు హాజరవడం లేదని.. ఆయా ముఖ్య నేతలు చెబుతున్నారు. పీసీసీని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదనే అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.