తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని.. బీజేపీలో విలీనం చేయడం చెల్లదంటూ… టీడీపీలో మిగిలిపోయిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల్లో ఒకరు అయిన… కనకమేడల రవీంద్రకుమార్ వాదిస్తున్నారు. ఆయన సీనియర్ న్యాయవాది. చట్టాలను పుక్కిట పట్టారు. తెలుగుదేశం పార్టీ న్యాయవిభాగానికి చాలా కాలంగా… నేతృత్వం వహించారు. అయినంత మాత్రాన.. ఆయన చట్టంలోని… సెక్షన్లు, పేజీలు చెప్పి… టీడీపీపీ విలీనం చెల్లదని వాదిస్తే సరిపోతుందా..?. ఆ చట్టాలను అమలు చేసేవారు.. దాన్ని ఆమోదించాలి కదా..! ఆమోదించాలో వద్దో.. పవర్స్ ఉన్న వాళ్లే… లెక్కలోకి తీసుకోకపోతే.. వారి వాదనే చెల్లుబాటు కాదు. తెలంగాణలో కాంగ్రెస్కు… ఢిల్లీలో టీడీపీకి అదే పరిస్థితి కనిపిస్తోంది.
టీడీపీ వాదనే చెల్లుబాటు కాదు..! అదంతే..!?
టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తూ… రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసేసుకున్నారు. అయితే.. ఆ విలీనం ప్రక్రియ చెల్లదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వాదిస్తున్నారు. ఆ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి.. పార్టీమారిన నలుగురు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు చేశారు. విలీనం ప్రక్రియ రాజ్యసభ చైర్మన్ పరిధిలో ఉండదని రవీంద్రకుమార్ వాదిస్తున్నారు. విలీనంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని, విలీనాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్, చైర్మన్కు ఉండదని కనకమేడల చట్టాలను ఉదహరిస్తున్నారు. కానీ రాజ్యసభ చైర్మన్ పరిశీలిస్తామని చెప్పి ఆయనను పంపేశారు. అది ఈ పాటికి చెత్త బుట్టలోకి చేరిపోయి ఉంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ వాదన ఎక్కడ చెల్లుబాటయింది..!?
తెలంగాణలో కొంత కాలం నుంచి… కాంగ్రెస్ పార్టీ.. ఈ విలీనం చెల్లదని వాదిస్తూ వస్తోంది. ముందస్తు ఎన్నికలు జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ.. విలీనాల్లో.. చిక్కి శల్యమైపోతోంది. మొదట.. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్సీలందర్నీ.. లాగేసుకుని… టీఆర్ఎస్ విలీనం చేసేసుకుంది. దానిపై కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకుంది. విలీనం… మండలి చైర్మన్ చేతుల్లో లేదని గగ్గోలు పెట్టింది. ఆ గగ్గోలు ఆలా సాగుతూండగానే.. ఎమ్మెల్యేలను కూడా లాగేసుకుని… విలీనం చేసేసుకుంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇప్పటికీ… విలీనం చెల్లదని.. గగ్గోలు పెడుతున్నారు. కోర్టుకు వెళ్లారు. అయినా వారి వాదనే చెల్లడం లేదు.
అధికార పార్టీ ఏది చెబితే.. అదే చెల్లుబాటు.. ! అదే ఫైనల్..!
నిజానికి.. లెజిస్లేచర్ పార్టీల విలీనం అనేది.. ఎక్కడా లేదు. అయితే .. గియితే పార్టీ విలీనం అవుతుంది కానీ.. లెజిస్లేచర్ పార్టీల విలీనం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ… స్పీకర్లు, మండలి చైర్మన్లు, రాజ్యసభ చైర్మన్లు.. ఇవేమీ పట్టించుకోవడం లేదు. వారికి.. చీఫ్ జస్టిస్లతో పాటు సమానంగా అధికారాలుంటాయి. అందుకే.. వారు.. తమ తమ పార్టీల అధినేత ఆదేశాలను పాటిస్తున్నారు. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండటంతో.. ప్రతిపక్ష వాదన చెల్లుబాటు కావడం లేదు.