విపక్ష నేతలకు కేసీఆర్ కరోనా అంటించే కుట్ర చేస్తున్నారని… కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ఆయన ఓ కారణం కూడా చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఈ రోజు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే.. పోలీసులు వారిని మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. అందర్నీ ఓ వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించలేదు. కనీసం వారిని తీసుకెళ్లిన వాహనాలను శానిటైజ్ కూడా చేయలేదు. అందుకే.. భట్టి విక్రమార్కకు… కరోనా అంటించే కుట్ర జరుగుతోందని అనిపించింది. గతంలో.. తనను ప్రశ్నించిన వారికి.. కరోనా రావాలని కేసీఆర్ శాపనార్థాలు పెట్టారని.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేస్తూ.. కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. ముఖ్యమంత్రి అతి పెద్ద కుట్ర దారు అని మండిపడ్డారు. తమలో ఎవరికైనా కరోనా సోకితే… కేసీఆర్, డీజీపీదే బాధ్యతని.. భట్టి స్పష్టం చేశారు.
కరోనా నిబంధనల పేరుతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టాలనుకున్నా.. పోలీసులు తక్షణం వారి ఇంటి ముందు వాలిపోతున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. గతంలో కృష్ణా గోదావరి ప్రాజెక్టుల బాట అనే కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు అరెస్ట్ చేశారు. ఆదివారం వరంగల్ జిల్లాలో ఓ దళిత యువకుడి హత్య విషయంలో… నిరసనల కోసం వెళ్లాలనుకున్నా హౌస్ అరెస్టులు చేశారు. అయితే.. ఈ రోజు.. రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నా.. ఎవర్నీ హౌస్ అరెస్టులు చేయలేదు. అందరూ గాంధీ భవన్ నుంచిర్యాలీగా బయలుదేరిన తర్వాత మధ్యలో అడ్డుకుని.. వాహనాల్లో తరలించారు. ఎక్కడా కోవిడ్ రూల్స్ లేవు. దీంతో.. తమకు కరోనా అంటించే కుట్ర జరుగుతోందని.. వారు ఆందోళన చెందుతున్నారు.
ఒక్క కాంగ్రెస్ పార్టీ నేతలకే.. కాదు.. ఈ రోజు… జర్నలిస్టులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సచివాలయ కూల్చివేత కవరేజీకి అనుమతిస్తమన్న ప్రభుత్వం ఓ మినీ లారీలో అందర్నీ ఎక్కించి… తీసుకెళ్లింది. ఆ లారీలో కిక్కిరిసిపోయి.. జర్నలిస్టులు.. వీడియో జర్నలిస్టులు.. సచివాలయం కూల్చివేత ప్రాంతానికి వెళ్లారు. దాంతో… వారికీ కరోనా భయం ప్రారంభమయింది. కరోనా రూల్స్ పాటించకుండా.. పోలీసులే ఇలా చేస్తే ఎలా అని మీడియా ప్రతినిధులు గొణుక్కున్నారు కానీ… కాంగ్రెస్ నేతల్లా ఆరోపణలు చేయలేని పరిస్థితి.