ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పోషించాల్సించాల్సిన పాత్ర తెలంగాణలో చాలానే ఉంది. ప్రజల తరఫున పోరాడాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి. కానీ, పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఇంతవరకూ కుదరలేదనే చెప్పాలి. పార్టీలో అంతర్గత వ్యవహారాలకే ఇంతవరకూ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇన్నాళ్లకు సమస్యలపై పోరాటం చేసేందుకు టి. కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఎట్టకేలకు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. ఇప్పటికే తెరాస, భాజపాలు పోటీ పడి మరీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాయి. వాటికి ధీటుగా కాంగ్రెస్ కార్యాచరణ ఉంటుందని నేతలు అంటున్నారు.
ప్రజా సమస్యలపై మూడు కమిటీలను పీసీసీ వేసింది. యాదాద్రి అంశంపై వేసిన కమిటీలో కోమటిరెడ్డి, వీ హన్మనంతరావు, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ఉన్నారు. గుట్ట వ్యవహారంపై ఈ నాయకుల మాత్రమే మాట్లాడుతూ, అవసరమైన పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నారు, దానికి అనుగుణంగానే ముందుకు సాగుతున్నారు. ఇక, రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు కానుంది. యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ పోరాట బాధ్యత అంతా ఇకపై రేవంత్ రెడ్డిదే. కొత్త రెవెన్యూ చట్టం మీద కూడా ఒక కమిటీ వేసి, లోపాలను ఎత్తి చూపుతూ పోరాటానికి సిద్ధమౌతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానిపై పోరాటానికి కూడా కమిటీ సిద్ధమైంది.
ఒక ప్లాన్ ప్రకారం పోరాటాలు చేయాలనే నిర్ణయానికి టి. కాంగ్రెస్ రావడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. లేదంటే, ఎవరికి నచ్చినట్టు వారు కార్యాచరణ చేపట్టేస్తున్న పరిస్థితి ఈ మధ్య చూశాం. రైతుల కోసం యాత్ర చేస్తానంటూ కోమటిరెడ్డి సిద్ధమైన పరిస్థితి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కుంభకోణాలపై రేవంత్ రెడ్డి మాత్రమే మాట్లాడతారు. గాంధీ భవన్ దగ్గర ఆ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇక వీహెచ్ ఆయన నిరసన కార్యక్రమాలు ఆయనవి. ఇలా ఎవరికివారు ప్రభుత్వంపై పోరాటం పేరుతో… సొంత పార్టీలోని ఇతర నాయకులతో సమన్వయం లేకుండా చేసుకుంటూ పోతున్నారు. కనీసం ఈ కమిటీలు ఏర్పాటు చేయడం వల్లనైనా ఎవరి పనివారు చేస్తూ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక, కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి?