సంపన్న రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వాటికి చెల్లించడంపై కాకుండా అనవసరమైన ఖర్చు చేసే పనులపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్త్రంలో 3,200 కాలేజీలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు.
తెరాస ప్రభుత్వంపై సమర శంఖం మోగించిన కాంగ్రెస్ పార్టీ, గురువారం మహబూబా బాద్ లో రైతు గర్జన సభ జరిపింది. శుక్రవారం శంషాబాద్ లో నిర్వహించిన విద్యార్థి గర్జన సభలో ఉత్తం మాట్లాడారు. లక్షా 30 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా, ప్రభుత్వం 3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేక పోతోందని విమర్శించారు. నెల రోజుల పాటు దరఖాస్తుల ఉద్యమం కొనసాగించిన తర్వాత డిసెంబర్ 2న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సభకు హాజరవుతారని తెలిపారు.
అటు రైతులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ సర్కారుకు రైతుల ఉసురు తగులుతుందని రైతు గర్జన సభలో కాంగ్రెస్ నేతలు శాపనార్థాలు పెట్టారు. రుణమాఫీ ఒకేసారి చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రుణమాఫీతో పాటు నకిలీ విత్తనాలు, ఇతర రైతు సమస్యలపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. జిల్లాల పునర్విభజన అంశంలోనూ తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శల దాడి చేసింది.
రెండు పడక గదుల ఇళ్ల పథకం పడకేసిన వైనంపైనా కాంగ్రెస్ నిప్పులుచెరుగుతోంది. తెరాస సర్కార్ వైఫల్యాలనే అస్త్రాలుగా మలచుకుంటూ విమర్శల పదును పెంచుతోంది. మరో ప్రతిపక్షం టీడీపీ బలహీన పడటంతో కాంగ్రెస్ అన్నీ తానై ప్రభుత్వంపై విరుచుకు పడుతోంది. బీజేపీ నేతలు మాత్రం అడపా దడపా తాము ప్రతిపక్షమే అన్న విధంగా నిరసనలు తెలుపుతున్నారు. సర్కార్ వైఫల్యాలు ఎన్నెన్నో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, బీజేపీ ప్రతిపక్షంగా కాకుండా తెరాస మిత్రపక్షంలా వ్యవహరిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ వీలైనంత బలపడటానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.