ఆర్టికల్ 370 రద్దు భాజపాకి రాజకీయంగా బాగా కలిసొచ్చే అంశంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఆ ప్రభావం ముందుగా తెలంగాణలో కనిపిస్తోంది. పార్టీని త్వరగా విస్తరించాలనే వ్యూహంతో భాజపా ఇక్కడ వ్యవహరిస్తోంది. సభ్యత్వ నమోదు చేస్తోంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్నికల్లో ప్రచారాంశంగా మార్చుకునే పనిలో పడింది. పట్టణ ప్రాంతాల్లో ఈ అంశం ప్రభావం పార్టీకి కలిసొస్తుందని భావిస్తోంది. అయితే, ఇదే సమయంలో టి. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు స్పందించడం లేదు! మున్సిపల్ ఎన్నికల్లో ఏ అంశంతో ప్రచారానికి వెళ్లాలనేది తేల్చుకోలేని డైలమాలో పడ్డారు.
కాశ్మీరు అంశంలో భాజపా అనుసరిస్తున్న తాజా వైఖరిపై టి. కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ మాట్లాడలేదు! కారణం, కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి ఇదే అంశంపై వేరేలా ఉంది కదా! జాతీయ స్థాయిలో ఆర్టికల్ 370 రద్దుని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో, ఇప్పుడు తెలంగాణ నేతలు కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస, భాజపా విధానాలపై విమర్శలు చేస్తూ ముందుకెళ్లాలని కొద్దిరోజుల కిందటే పీసీసీ అధ్యక్షుడు నేతలకు సూచించారు. తెరాస ఫిరాయింపులు, రాష్ట్రానికి భాజపా చేసిందేం లేదనే అంశాలను ప్రధానంగా ప్రచారం చేయాలనుకున్నారు. తెరాస మీద కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోంది కాబట్టి, దాన్నీ వాడుకోవాలని భావించారు.
కానీ, ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా పక్కకు వెళ్లిపోయిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రచారానికి ధీటుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకించిన అంశాన్నే భాజపా నేతలు ఇక్కడ బలంగా ప్రచారం చేస్తారు. దేశ ప్రయోజనాలపై ఆ పార్టీకి బాధ్యత లేదనీ, ఉంటే కాశ్మీరు అంశానికి మద్దతు ఇచ్చేవారు కదా అని రాష్ట్ర నేతలు ఇప్పటికే విమర్శలు పెంచిన పరిస్థితి. వీటిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై టి. కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంటులో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో.. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేయాలనే అంశ టి.కాంగ్రెస్ కి చెందిన కొద్దిమంది నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. హైకమాండ్ నుంచి ఏదో ఒక సమాచారం వస్తే తప్ప మనం మాట్లాడలేమని ప్రముఖ నేతలు చేతులెత్తేసి కూర్చున్న పరిస్థితి ఉందని సమాచారం! వాస్తవం మాట్లాడుకుంటే, ఈ సమయంలో హైకమాండ్ కూడా ఏం చెప్పగలదు..? నిన్నమొన్నటి వరకూ రాహుల్ రాజీనామా, నాయకత్వ సంక్షోభంలో ఆ పార్టీ ఉంది. ఇప్పుడు కాశ్మీరు అంశంపై వ్యతిరేక వైఖరి కూడా మరో సమస్య అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార అజెండాను హైకమాండ్ ఎలా నిర్దేశించగలదు..?