తెలంగాణలో కెసియార్ కుటుంబానికి ఎదురు నిలిచే నాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో ప్రస్తుతానికి కనపడడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉన్న 3 విపక్ష పార్టీల్లో ఒకటైన తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసేశారు. ఇక భాజాపా పరిస్థితి దానికే అర్ధం కావడం లేదు. కేంద్రంతో కేసియార్ సయోథ్య చూస్తూ… తాము టిఆర్ ఎస్‌కు మిత్రపక్షమో, విపక్షమో తేల్చుకోలేని దుస్థితిలో ఆ పార్టీ నేతలు కిందా మీదా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితులన్నీ కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ క్రమ క్రమంగా ఊపు తెచ్చుకుంది. రేవంత్‌రెడ్డి లాంటి నేతలు పార్టీలోకి రావడం, విజయశాంతి మళ్లీ యాక్టివ్ అవుతాననడం… వీటిని మించి తెలంగాణ జెఎసితో సత్సంబంధాలు…. ఆ పార్టీని ప్రస్తుతానికి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పీఠాన్ని ఎక్కించాయి.
ఈ ఊపును కొనసాగించాలనుకుంటున్న కాంగ్రెస్ రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సంగతి కనిపిస్తోన్నదే. ఈ క్రమంలో ఆ పార్టీకి పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష పార్టీని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యేలు చేజారిపోతున్నా, నంద్యాల వంటి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చినా వెరవక అలుపెరుగక పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ లా గాని పనిచేస్తే తాము కూడా తెలంగాణలో బలోపేతం అవుతామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే… జగన్‌లాగ పాదయాత్రలకు కూడా ప్లాన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీకి ఊపు తెచ్చిన రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని ఆశిస్తున్నాడు. మంచి వాగ్థాటి ఉన్న రేవంత్… తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తే అది తప్పకుండా పార్టీకి మేలు చేస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే ఆ పార్టీలో సిఎం పదవి కోసం ఉన్న పోటీ ప్రస్తుతానికి రేవంత్ పాదయాత్రకు బ్రేక్‌లు వేసిందని సమాచారం.
ఇదిలా ఉంటే హామీల విషయంలోనూ తెలంగాణ కాంగ్రెస్ జగన్ నే స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఊరూ వాడా వాగ్ఘానాల వర్షం కురిపిస్తున్న వైసీపీ లాగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ హామీల కుమ్మరింపుకు సై అంటొంది. తాజాగా బుధవారం మహబూబ్‌నగర్ జడ్చర్లలో నిర్వహించిన జనగర్జన సభలో టీపీసిసి అథ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ అంటూ ప్రకటించేశారు. అంతేకాదు… తెలంగాణలో నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. అదే విధంగా మరికొన్ని హామీలపై కూడా తెలంగాణ కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.