తెరాస ధాటికి కుప్పకూలిందనుకొన్న కాంగ్రెస్ పార్టీ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు పుణ్యమాని మళ్ళీ లేచి నిలబడి, తెరాస ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే స్థితికి చేరుకోగలిగింది. ఆ జోరుని అలాగే కొనసాగిస్తూ రాష్ట్రంలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు సిద్దం అవుతోంది.
ఆ ప్రయత్నాలలో భాగంగానే మళ్ళీ ఈనెల 7న “ఛలో మల్లన్నసాగర్” కార్యక్రమం పెట్టుకొంది. అంతేకాదు త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను కూడా సందర్శించి అక్కడ పరిస్థితులని సమీక్షించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకొన్నారు. ఈనెల 13న అదిలాబాద్ లో సమన్వయ కమిటీ సమావేశం, త్వరలో కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లిలో బారీ బహిరంగ సభ, ఒక్కరోజు రైతులతో కలిసి నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా నిర్వహించబోతోంది. ఖమ్మం జిల్లాలోని ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పేర్లని మార్చినందుకు కూడా పోరాడాలని నిర్ణయించింది. ఈనెల 9లోగా మండల స్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేసుకొని, సాగునీటి ప్రాజెక్టుల పేర్లు, డిజైన్ల మార్పులు, అవినీతి, నిర్వాసితుల సమస్యలపై దీర్గకాలిక పోరాటాలకి ప్రణాళికలు సిద్దం చేసుకొంతోంది.
కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా తెరాస దెబ్బ నుంచి కోలుకొని ప్రభుత్వంపై పోరాడటానికి సిద్దం కావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడిపోయినవారు కూడా ఇది చూసి ‘తొందరపడ్డామేమో’ అని అనుకోనే అంతగా అది తేరుకొంది.
ఈనెల 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి తెలంగాణాకి వస్తున్నారు. సరిగ్గా అదే రోజున కాంగ్రెస్ పార్టీ “ఛలో మల్లన్నసాగర్” కార్యక్రమాన్ని పెట్టుకోవడం వ్యూహాత్మకమేనని చెప్పవచ్చు. ప్రధాని గజ్వేల్ పర్యటన కోసం తెలంగాణా ప్రభుత్వం బారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మంత్రులు, అధికారులు, పోలీసులు అందరూ అదేపనిలో నిమగ్నం అయ్యుంటారు. కనుక ఈసారి కాంగ్రెస్ నేతల మల్లన్నసాగర్ పర్యటనకి పోలీసుల నుంచి పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ అడ్డుకొన్నా కూడా మంచిదే. అక్కడ వీలయినంత రభస చేస్తే అది ప్రధాని దృష్టికి వెళుతుంది. కనుక తెలంగాణా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మరో అగ్నిపరీక్ష పెట్టినట్లే భావించవచ్చు.