ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ పార్టీ కొంత ఖుషీగా ఉండటం విశేషం! కేసీఆర్ ఆశించినట్టుగా సభ జరగలేదనీ, పాతిక లక్షలమంది వస్తారని గొప్పలు చెప్పారనీ, చివరికి వచ్చింది నాలుగు లక్షలు దాటలేదంటూ కాంగ్రెస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేశారు. పిట్టకథలు చెప్పేందుకు కేసీఆర్ పనికొస్తారంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఓటమి తప్పదన్నారు. అబద్ధాలు చెప్పడంలో తండ్రీ కొడుకులు పోటీలు పడుతున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి… తెరాస సర్కారు వైఫల్యాల గురించి మాట్లాడారు.
మొత్తానికి, ప్రగతి నివేదన సభ అనంతరం గాంధీభవన్ లో కొంత ఉత్సాహభరితమైన వాతావరణం కనిపించిందనడంలో సందేహం లేదు. నిజానికి, కేసీఆర్ సభ ప్రకటించిన దగ్గర్నుంచీ… తెరాస చర్యలపై కొన్ని ప్రత్యేక విభాగాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి, నిఘా పెట్టించిందని సమాచారం! సభ జరుగుతున్నంతసేపూ… ఏయే ప్రాంతాల నుంచీ ఎంతమంది ప్రజలు వస్తున్నారు, నియోజక వర్గాలవారీగా తెరాస నేతల వ్యూహాలేంటనేవి ప్రత్యేకంగా నివేదికలు తయారు చేయించుకున్నారట! వారి లెక్కల ప్రకారం… తెరాస సభకు పెద్దగా ఆదరణ లభించలేదనీ, దీంతో ప్రభుత్వ వ్యతిరేకత తాము అంచనా వేస్తున్నదానికంటే ఎక్కువగా ఉందనేది గాంధీభవన్ లో సోమవారం నాడు నేతల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా తెలుస్తోంది. విభేదాలను కొన్నాళ్లు పక్కనపెట్టి, కాస్త శ్రమిస్తే… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే విశ్లేషణలు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సభాముఖంగా ముందస్తు ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన ఏదీ చెయ్యనప్పటికీ, తెరాస వర్గాలకు త్వరలోనే ఎన్నికలు అనే సంకేతాలు బలంగా ఇచ్చారనే ప్రచారం బాగా జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయమై స్పష్టతతో ఉన్నారనీ… ఇకపై నేతలంతా సొంత నియోజక వర్గాలకు మాత్రమే పరిమితం కావాలని కేసీఆర్ సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా వీలైనంత త్వరగా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో భారీ సభలు నిర్వహించాలనే అంశంపై త్వరలోనే ఒక స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం! తెలంగాణ ప్రకటించిన సోనియా గాంధీని సభలకు రప్పించగలిగితే… కాంగ్రెస్ పార్టీకి మరింత ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రగతి నివేదన సభకు సంబంధించిన నివేదికల్ని ఢిల్లీకి పంపించి, సోనియాను ఆహ్వానించే ప్రయత్నమూ చేయబోతున్నారట! ఏదేమైనా, కేసీఆర్ నిర్వహించిన సభ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి జోష్ పెంచిందనే చెప్పొచ్చు.