‘ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?’.. ఈ ఒక్క ప్రశ్నకూ హైకమాండ్ నుంచి స్పష్టమైన సమాధానం వస్తే తప్ప, తెలంగాణ కాంగ్రెస్ లో ఈ అంశమై ఎప్పటికప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూ ఉండటం ఆగదు! ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, రాష్ట్ర నేతలంతా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇది. కిందిస్థాయి వర్గాలకు సీనియర్లు దిశానిర్దేశం చేయాల్సి అవసరం ఉంది. కానీ, సీనియర్లు ఏంచేస్తున్నారు… సీఎం సీటుపై కన్నేసి, ఆ దిశగానే ఆలోచిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పార్టీలో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం పదవి రేసులో తానే ఉన్నాననీ, తానే అర్హుడననే సంకేతాలు ఇచ్చేందుకు ఉత్తమ్ ఓ వ్యూహంతో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే ఒక కథనం మళ్లీ వినిపిస్తోంది!
ఈ మధ్య, బస్సుయాత్రలో కొన్ని చోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడూ ఆయన వెళ్తున్నప్పుడు.. ‘కాబోయే సీఎం సీఎం’ అంటూ కొన్ని నినాదాలు వినిపించాయట. కొంతమంది అభిమానులు ఉత్తమ్ ని సీఎం సీఎం అంటుంటే ఆ పదవి రేసులో తామూ ఉన్నామని భావించే నేతలకు ఎక్కడో కలుక్కుమంటుంది కదా! అదే జరిగిందట. అక్కడే ఆగలేని కొంతమంది… ఈ విషయాన్ని ఢిల్లీ దాకా మోసినట్టు సమాచారం. సీఎం రేసులో తానే ఉన్నానని చెప్పుకోవడం కోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ విధంగా ప్రజల్లోంచి చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనీ, ఆయన ఏర్పాటు చేసినవారే ఇలాంటి నినాదాలు చేశారనే కోణంలో ఢిల్లీకి చెప్పారట! అంతేకాదు, సీఎం సీఎం అని నినదిస్తున్నప్పుడు.. కనీసం దాన్ని ఖండించడమో, అలా ఇప్పుడే అనొద్దంటూ కార్యకర్తకు నచ్చజెప్పడమో లాంటివి కూడా ఉత్తమ్ చేయలేదన్న పాయింట్ ని కూడా కొంతమంది ఆశావహులు ఢిల్లీ హైకమాండ్ చెవిన వేశారని వినిపిస్తోంది. ఆ టాపిక్ మళ్లీ ఇప్పుడూ తెరమీదకి రావడం విశేషం.
రాహుల్ గాంధీ వచ్చే వారం రాష్ట్రానికి వస్తున్నారు. రెండ్రోజులపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తరహా ట్రిక్స్ ప్లే చేస్తారనీ, ఓరకంగా పార్టీలో ఆధిపత్యపోరుకి ఆయన ఆజ్యం పోస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నాల్లో కొంతమంది నేతలు ఉన్నారట! రాహుల్ ముందు కూడా ఉత్తమ్ అలానే పిలిపించుకుంటారేమో అనే అనుమానం కూడా వ్యక్తమౌతోంది. మొత్తానికి, ఈ సీఎం అభ్యర్థి ఎవరనే టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో.. మరీ ముఖ్యంగా ఆ కుర్చీ తమకే వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నవారిలో రోజురోజుకీ బాగా ఎక్కువౌతోందన్నది వాస్తవం! దీనిపై ఎంత త్వరగా స్పష్టత ఇస్తే.. అంత త్వరగా ఇతర వ్యూహాల గురించీ, ఎన్నికల ప్రచారాల గురించి ఆలోచిస్తారేమో..!