కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా గర్వంగా ఒక మాట చెప్పుకొంటుంటారు. “మా పార్టీని మేమే ఓడించుకోవాలి తప్ప వేరే ఏ పార్టీలు మమ్మల్ని ఓడించలేవు. మా పార్టీని మేము ఓడించుకొన్నప్పుడే ఇతర పార్టీలు విజయం సాధించి అధికారంలోకి వస్తుంటాయి,” అని చెప్పుకొంటారు. ఆ మాటలు నూటికి నూరు శాతం నిజమని తెలంగాణా కాంగ్రెస్ నేతలు మరోమారు నిరూపించి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కనుక దానికి ఓడిపోవడానికి కూడా అవకాశం లేదు. కనుక అంతఃకలహాలతో తుడిచిపెట్టుకుపోతుందేమో? అటువంటి అవకాశం ఉందని తెలిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ టీ-కాంగ్రెస్ నేతలెవరినీ తెరాసలోకి ఆహ్వానించి ఉండేవారు కారేమో.
ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పార్టీ శాసనసభా పక్ష నేత కె. జానారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో తెరాస కోవర్టుగా పనిచేస్తున్నారని, ఆయనని తక్షణం పార్టీ నుంచి బయటకి పంపించాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి మొదటి నుంచి తెరాస పట్ల కొంత మృదువుగా వ్యవహరిస్తుండటం చేత, పార్టీలో కొందరు ఆయనని అనుమానిస్తున్నారు. అందుకు చాలా బాధపడిన ఆయన శాసనసభాపక్ష నేత పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దపడ్డారు. కానీ అందరూ వారించడంతో ఆయన ఆ ఆలోచన విరమించుకొన్నారు. ఇప్పుడు పార్టీలో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మళ్ళీ అదే ఆరోపణలు చేయడంతో ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సంగతి తెలిసిన రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ పాల్వాయికి ఫోన్ చేసి వివరణ కోరారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంగిస్తున్న పాల్వాయిని తక్షణం పార్టీలో నుంచి తొలగించాలని షబ్బీర్ అలీ పార్టీని కోరారు.
కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిపై చలా ఘాటుగా విమర్శించారు. ఆయన పార్టీని నడపడం చేతకాని అసమర్ధుడు. పార్టీలో నేతలందరికీ ఎంతసేపు పదవులపై ఆశే గానీ పార్టీని కాపాడుకోవాలనే తపన లేదని విమర్శించారు. బహుశః ఆయనకి కూడా కాంగ్రెస్ అధిష్టానం షో-కాజ్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అందరూ కలిసి గెలిపించుకోలేకపోయినా అందరూ కలిసి దానిని కూకటివ్రేళ్ళతో పెకలించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు.