తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎన్నికల వేడి బాగా రగులుకుంది! కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన సభతోనే ఆ పార్టీలో కూడా ఎన్నికల ఊపు వచ్చేసింది. అంతేకాదు, ఏడో తేదీన హుస్నాబాద్ లో మరో సభ నిర్వహణకు కేసీఆర్ సిద్ధమౌతున్నారు. ఆ తరువాత, 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు కూడా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా సభల హడావుడి పెరిగింది. అయితే, ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్న ఆశావహుల మధ్య తాజాగా గాంధీభవన్ లో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగిందని సమచారం!
ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్ష స్థానం తమకు కావాలంటే తమకీ అంటూ ఓ అరడజను మంది నేతలు ఇప్పటికీ ఢిల్లీలోని హైకమాండ్ కి చెవిలో జోరీగలా ఫిర్యాదులు పంపుతున్న సంగతి తెలిసిందే. కానీ, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయన్నది ఖాయం కావడంతో… ఈ పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి గురించి ప్రయత్నాలు మానుకుంటేనే ఉత్తమం అనే అభిప్రాయంతో ఉన్నారట! అంటే, విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పాటుపడాలన్న మోటివ్ తో వచ్చిన మార్పు ఇది అయితే సంతోషించొచ్చు. కానీ, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే… మేం కూడా సిద్ధమని నేతలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలు మొదలుకొని.. అన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక వరకూ ఏ మాత్రం స్పష్టత లేని పరిస్థితి ఉందనేది ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్న పరిస్థితి.
ఇలాంటి సమయంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పాకులాడితే… ఒకవేళ, హైకమాండ్ దయతల్చి ఇచ్చేస్తే, ముందస్తు ఎన్నికల తలనొప్పులన్నీ మొత్తంగా నెత్తిన పడిపోతాయేమో అనే ఆందోళనతో ఆశావహులు ఉన్నారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. అప్పుడు జాతీయ నాయకత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి, పీసీసీకి కొంత సహకారం ఉంటుంది. కానీ, ఇప్పుడు తెలంగాణలో ముందస్తు అంటే… హై కమాండ్ కూడా రాష్ట్ర నాయకత్వం పనితీరుపైనే ప్రత్యేక దృష్టి పెడుతుందీ, హడావుడి ఎక్కువ ఉంటుంది, పని ఒత్తిడి పెరిగిపోతుందనే స్పష్టత సదరు నేతలకు వచ్చినట్టుగా వినిపిస్తోంది.
అందుకే, ఇలాంటి సమయంలో పార్టీ పదవుల కోసం ఆరాటపడుతున్నామనే ముద్రను తొలగించుకున్నట్టూ ఉంటుందీ, హైకమాండ్ దృష్టిలో పార్టీ ఐక్యత కోసం పాటుపడుతున్నామనే ఇమేజ్ కూడా దక్కుతుందీ… కాబట్టి, ప్రస్తుతానికి పదవుల పందేరాన్ని ఆపేస్తేనే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారట! బాధ్యతలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదే ఉంటాయి కాబట్టి… ఆయన్ని అనుసరించేయడమే అన్ని రకాలుగా మేలు అనే అభిప్రాయం ఆశావహుల్లో ఉందట! కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్న అనూహ్య ఐకమత్యం వెనక అసలు లెక్కలు ఇలా ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విశ్లేషణ.