తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజకీయం చేద్దామంటే సాధ్యం కావడం లేదు. వారు అడుగు బయటపెడితే పోలీసులు అడ్డుకుంటున్నారు. మొన్నటికి మొన్న కృష్ణా ప్రాజెక్టులపై దీక్ష చేస్తామంటే పోలీసులు హౌస్ అరెస్టులు చేసేశారు. సరే అప్పుడంటే.. లాక్ డౌన్ నిబంధనలు ఉన్నాయని పోలీసులు కారణం చెప్పారు. కానీ అన్నీ సడలింపులు ఇచ్చేసిన తర్వాత కరెంట్ బిల్లులు, నియంత్రిత వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి..చలో సచివాలయం అంటే.. ఇప్పుడూ అదే పని చేశారు. నేతలెవర్నీ ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు పోలీసులు. ఉత్తమ్ నుంచి వీహెచ్ వరకూ అందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు.
సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకే సచివాలయానికి వెళ్తున్నామని దానికి.. కూడా పోలీసులు అంగీకరించకపోవడం… ఏమిటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారని.. అయినా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వాపోయారు. కేసీఆర్ 10వేలమందితో కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభోత్సవం.. కేటీఆర్ వేలాదిమందితో సిరిసిల్లలో జలహారతి కార్యక్రమం చేశారని…కాంగ్రెస్ నేతలను మాత్రం అరెస్ట్ చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. డీజీపీ మహేందర్రెడ్డి ఎక్కువ చేస్తున్నారు, మేం పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నామా అని వీహెచ్ ప్రశ్నించారు.
రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుదామని ప్రజా పోరాటాలు ప్రారంభించాలనుకున్న టీ కాంగ్రెస్కు పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. సాధారణంగా పోలీసులు శాంతిభద్రతల సమస్య వస్తుందనుకున్నప్పుడే…హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. పోలీసులు వెంటనే వచ్చేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులపై తర్వాత దీక్షలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు.. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.