తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంట్లోనుంచి బయట అడుగు పెట్టకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ.. ఈ రోజు.. ప్రాజెక్టుల వద్ద.. దీక్షా కార్యక్రమాలను పెట్టుకున్నారు టీ కాంగ్రెస్ నేతలు. అందరూ.. తాము నిర్ణయించుకున్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలని ఎవరి ఇళ్ల నుంచి వారు బయలుదేరాలని అనుకున్నారు..కానీ అప్పటికే వారి ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చేశారు. గోదావరి దీక్షలకు వెళ్లడానికి పర్మిషన్ లేదని నిలిపివేశారు. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి. దాంతో కాంగ్రెస్ నేతల గోదావరి దీక్షలు.. ప్రారంభమవకుండానే ముగిసినట్లయింది.
కొద్ది రోజుల కిందట.. క్రిష్ణా ప్రాజెక్టులపై కూడా దీక్షలు చేయాలని బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న సెక్రటేరియట్ ముట్టడికి వెళదామనుకున్నా అదే పరిస్థితి . అన్ని చోట్లా.. కరోనా నిబంధనల గురించి పోలీసులు వారికి చెప్పి.. ఇల్లు కదలకుండా చేస్తున్నారు. దీంతో.. రాజకీయ పోరాటాలు చేద్దామనుకున్న కాంగ్రెస్ నేతలకు.. కష్టం లేకుండా పోయింది. ప్రెస్మీట్లలో ప్రభుత్వాన్ని విమర్శించి.. సరిపెట్టుకుంటున్నారు. రాజకీయంగానే కాదు.. ఇతర కార్యక్రమాలకు ఎక్కడకు వెళ్లాలని పోలీసులు అడ్డుకుంటూండటంతో.. సైలెంట్‌గా ఉండలేని రేవంత్ రెడ్డి వంటి నేతలు.. పోలీసులపై చిరాకు పడుతున్నారు.
గోదావరి దీక్షలకు వెళ్లకుండా ఉదయం పోలీసులు అడ్డుకున్న తర్వాత మధ్యాహ్నం సమయంలో రేవంత్ రెడ్డి.. కరోనాతో మరణించిన జర్నలిస్ట్ మనోజ్‌కు మద్దతుగా జరుగుతున్న దీక్షల వద్దకు వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. తాను గోదావరి దీక్షలకు వెళ్లడం లేదని.. జర్నలిస్టు దీక్షలకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దాంతో ఆయన వారిపై అసహనం వ్యక్తం చేశారు. తన ఇంటి చుట్టూ కనీసం వంద మందికిపైగా పోలీసులు ఉండటం చూసి.. మరింత ఆశ్చర్యపోయారు. డీజీపీ ఆఫీసుకు కాపలా పెట్టుకోవాలని మండిపడ్డారు.