తెలుగు రాష్ట్రాల్లో భాజపా విస్తరణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి! దాన్లో భాగంగా తొలుత ఆంధ్రా నుంచి నలుగురు టీడీపీ నేతలు కాషాయ తీర్థం పుచ్చేసుకున్నారు. కానీ, ఏపీ కంటే ముందుగానే తెలంగాణ నేతల చేరికలు జరుగుతాయనుకున్నాం. అక్కడ కాంగ్రెస్ పార్టీని భాజపా లక్ష్యం చేసుకుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ మీదే ఎదురు తిరగడం చూశాం! ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేశారు, పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ కూడా అందుకున్నారు. ఇంకోపక్క, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా కొన్ని రోజులు హైదరాబాద్ లో బస చేసి… చేరాలనుకునే నేతలు, చేర్చుకోవాలనే నేతల్ని కూడా కలిసినట్టు కథనాలొచ్చాయి. ఇక మిగిలింది చేరికలే!
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరిక ముహుర్తాన్ని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తారని సమాచారం. పార్టీలో చేరిన వెంటనే తెలంగాణలో ఒక సభ నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. అయితే, ఆయనతోపాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేస్తారనే గుసుగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ మాజీ కేంద్రమంత్రులే. ఒకరు బలరామ్ నాయక్, మరొకరు సర్వే సత్యనారాయణ. ఈ ఇద్దరూ భాజపా అధినాయకత్వంలో మంతనాలు సాగించినట్టు సమాచారం. అనుచర వర్గాల్లో కూడా భాజపాలో చేరికపై అభిప్రాయ సేకరణ చేశారట. ఢిల్లీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందనీ, రాజగోపాల్ రెడ్డితో కలిసి చేరేందుకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు కూడా అందినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇది నిజమా అని ఈ ఇద్దర్నీ మీడియా ప్రశ్నిస్తే… సర్వే సైలెంట్ అయిపోయారు! అవునో కాదో కూడా ఆయన స్పందించని పరిస్థితి. ఇక, ఇదే ప్రశ్న బలరామ్ నాయక్ ను అడిగితే… భాజపా నుంచి తమకు ఆహ్వానం అందిన మాట వాస్తవమే అన్నారు! అంతే, ఆహ్వానాన్ని అంగీకరించారా, తిప్పి కొట్టారా… ఏ స్పష్టత ఏదీ ఇవ్వలేదు. కానీ, ఈ ఇద్దరూ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారమే కాంగ్రెస్ వర్గాల్లోనూ జరుగుతోంది, తెలంగాణ భాజపా శ్రేణులు కూడా రాజగోపాల్ తోపాటు ముందుగా ఓ ముగ్గురి చేరికలు ఉంటాయనే చెబుతున్నాయి. తొలి విడత చేరికల అనంతరం ఒక బహిరంగ సభ పెట్టాలనీ, తద్వారా భాజపాయే ఇక్కడ ప్రయత్యామ్నాయం అనే సందేశం ఇవ్వాలని భావిస్తున్నారట! సో… తెలంగాణలో కూడా భాజపా చేరికల బోణీ చేయబోతోందన్నమాట!