తెలంగాణలో తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తు… కొన్నాళ్ల కిందట ఈ అంశం చర్చకు వచ్చింది. అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా ఇదే ప్రతిపాదన తెరమీదికి తీసుకొచ్చారు. కానీ, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నది అప్పట్లోనే స్పష్టమైపోయింది. ఆ తరువాత, పొత్తు చర్చ తెర మరుగైపోయింది. కానీ, తాజా పరిస్థితులు మరోసారి ఆ చర్చను తెర మీదికి తెచ్చే దిశగా వెళ్తున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ అంశాన్ని తెర మీదికి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలౌతున్న సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా రాష్ట్రంలో టీడీపీ పట్టుపై కూడా కొంత ఆరా తీసినట్టు సమాచారం..!
దాదాపు 25 నుంచి 30 నియోజక వర్గాల్లో టీడీపీ అభిమానులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ అంచనాలో తేలినట్టు తెలుస్తోంది. కొన్ని నియోజక వర్గాల్లో దాదాపు 20 వేలకు పైగా టీడీపీ మద్దతు దారులున్నట్టు గుర్తించారట. రాష్ట్రస్థాయిలో పార్టీ బలోపేతంగా లేకపోయినా… క్షేత్రస్థాయిలో కేడర్ లో కొంత భాగం పార్టీపై అభిమానంతో ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరిగినట్టు సమాచారం. కాబట్టి, టీడీపీ ఓట్లు క్రియాశీలం కాబోతున్నాయనే స్థానాల్లో ఆ పార్టీకే అవకాశం ఇచ్చి, కాంగ్రెస్ మద్దతు ఇస్తే… తెరాస గెలుపును అడ్డుకోవడం సులభం అనే అంశమై టి కాంగ్రెస్ ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. అంతేకాదు, ఈ పొత్తు ప్రతిపాదనను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా టీ పీసీసీ పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించిన సమయంలో పొత్తు విషయం మరోసారి తెర మీదికి తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
దీంతో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు సాధ్యమా అనేది టీడీపీలో మళ్లీ చర్చనీయాంశమే అవుతుంది. అయితే, దానికంటే ముందు… ప్రస్తుతం రాష్ట్రంలో మిగిలి ఉన్న కేడర్ ను రాష్ట్ర టీడీపీ ఎంతవరకూ నిలుపుకుంటుందీ, మరింత బలోపేతానికి ఏం చేస్తుందనేదే ప్రశ్న..? ఎందుకంటే, టీ టీడీపీలో బలమైన నాయకులు లేరు. ఉన్నవారిలో క్రియాశీలంగా ఉండేవారు తక్కువ. స్వతంత్రంగా వ్యవహరించే చొరవ ఎవ్వరూ తీసుకోవడం లేదు. అధ్యక్షుడు చంద్రబాబు ఏదో ఒక సభ పేరుతో రాష్ట్రానికి వచ్చినప్పుడు కొంత హడావుడి కనిపిస్తోంది తప్ప… సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసే చర్యలు కనిపించడం లేదు! ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కావొచ్చు, తెరాస కావొచ్చు.. పొత్తు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పుడు సంకేతాలు ఇస్తున్నా… దాన్ని నిలుపుకునే స్థాయిలో టీడీపీ సిద్ధపడుతుందా అనేదే ప్రశ్న..? ఇతర పార్టీలతో పొత్తు ఉన్నా లేకున్నా స్వతంత్రంగానైనా కొంత ప్రభావం చూపే స్థాయిలో టీడీపీకి తెలంగాణలో ఉంటుందన్నది వాస్తవం. దాన్ని నిలుపుకోవడమే ఇప్పుడు టీటీడీపీ ముందున్న సవాల్.