తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉంటున్నా, ఆ స్థాయిలో అధికార పార్టీని ప్రభావితం చేయడంలో తడబడుతూనే ఉంది. సమస్యలపై కేసీఆర్ సర్కారుని సమర్థంగా నిలదీసే ప్రయత్నంలో ఫలితాలను రాబట్టలేకపోతోంది. దీనికి కారణం పార్టీలో అంతర్గత అనైక్యత అనేది జగమెరిగిన సత్యం! సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… కేసీఆర్ సర్కారుపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని తాజా సీఎల్పీ భేటీలో నేతలు నిర్ణయించారు. జానారెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ మరోసారి కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వాల రద్దు చర్చే జరిగింది. కోర్టు ఆదేశించినా కూడా తమ సభ్యత్వాలపై స్పీకర్ స్పందించలేదని సంపత్, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ విషయంలో టీపీసీసీ, సీఎల్పీ తమకు మద్దతుగా నిలవలేదని ఆక్షేపించారు. తెరాసకు వ్యతిరేకంగా సమగ్ర కార్యాచరణ అమలు చేయలేకపోయారని నేతల తీరును తప్పుబట్టారు.
గతం గతః అన్నట్టుగా, ఇక మీదట కేసీఆర్ పై వ్యతిరేక పోరాటం తీవ్రతరం చేద్దామని నిర్ణయించారు. న్యాయ పోరాటంతోపాటు, ప్రజా పోరాటాల ఉద్ధృతిని పెంచాలని భావిస్తున్నారు. దీంతోపాటు కేసీఆర్ సర్కారు అవినీతిపై జాతీయ స్థాయిలో ప్రచారం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. ఇక చివరి అస్త్రం… తమ పోరాటాలపై కేసీఆర్ స్పందించకపోతే మూకుమ్మడిగా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీ ఆదేశిస్తే రాజీరామాలకు సిద్ధమని షబ్బీర్ అలీ అంటే, ఎమ్మెల్యేలుగా ఉంటూ తమకోసం పోరాటాలు చేయాలనీ, చివరి అస్త్రంగా రాజీనామాలపై ఆలోచిద్దాం అని సంపత్ అన్నారు! దీంతో అందరూ మూకుమ్మడి రాజీనామా ప్రతిపాదనకు ఓకే అన్నారు.
అయితే, రాజీనామాల వరకూ వెళ్లాలంటే… ఈలోగా న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాలు చెయ్యాలి కదా! వీటిని అనుకున్నట్టుగా అమలు చేశాక.. చివరి అస్త్ర ప్రయోగం కదా అది! ఈలోగా కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపై నిలపడం అనే సవాల్ ఉంది! ఈ పోరాటాలకు ఉత్తమ్ నాయకత్వం వహిస్తే అందరూ వెంట నడుస్తారా అనేది ప్రశ్నే..? పోనీ, కొత్తగా చేరిక రేవంత్ రెడ్డి లాంటివాళ్లకు అవకాశం ఇస్తారా అంటే అదీ ప్రశ్నే..? సీనియర్లు ముందు వరుసలో నిలిస్తే మిగతావారంతా వారికి అండగా ఉంటారా అంటే, ఇదీ ఇంకో ప్రశ్నే..? ఈ సందిగ్ధతల మధ్యలోంచి న్యాయ, ప్రజా పోరాటాలు సాగాలన్నమాట!