అందరినీ ఆశ్చర్యపరుస్తూ తెలంగాణా కాంగ్రెస్ ఎంపి వి.హనుమంత రావు ఈరోజు ఉదయం కిర్లంపూడికి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంని కలిసి ఆయనకి సంఘీభావం తెలిపారు. అందుకు ఆయనని ఎవరూ తప్పు పట్టలేరు కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్పుకోవడమే తప్పు. విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం (1994) లోనే కాపులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి జిఓ ఇచ్చారని కానీ ఆ తరువాత వచ్చిన తెదేపా ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మాట తప్పడంతోనే ఉద్యమం మొదలయిందని అన్నారు. ఈ సమస్యని ఇంకా ఎక్కువ కాలం నాన్చకుండా తక్షణమే పరిష్కరించుకోవాలని చంద్రబాబు నాయుడుకి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ తరువాత సమైఖ్య రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెదేపా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న హనుమంత రావు, ఆ తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోలేదనే విషయాన్ని ప్రస్తావించక పోవడం గమనార్హం. సమైక్య రాష్ట్రంలో తెదేపా తరువాత వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఏకధాటిగా ఐదేళ్ళపాటు పరిపాలించారు. ఆయన మరణించిన తరువాత అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన కె. రోశయ్య సుమారు రెండేళ్ళపాటు పరిపాలించారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయే వరకు మూడేళ్ళపాటు పరిపాలించారు.
కాంగ్రెస్ పార్టీకి నిజంగా కాపుల పట్ల అభిమానం ఉండి ఉంటే పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించినపుడే గతంలో తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇచ్చిన జిఓను అమలుచేసి ఉండవచ్చును. కానీ అప్పుడు అసలు ఆ ఊసే ఎత్తలేదు. ఎందుకంటే అది ఒక తేనె తుట్టె వంటిదని వారికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష బెంచీలలోకి వచ్చి కూర్చొంది కనుక మళ్ళీ హనుమంత రావు వంటి కాంగ్రెస్ నేతలు కాపుల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో తెదేపా కూడా ఒకప్పుడు అదే విధంగా వ్యవహరించింది. పైగా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కనుక ఇప్పుడు అది ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవలసి వస్తోంది.