తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో రాజుకుంటూ ఉందో చూస్తూనే ఉన్నాం. ఎవరి అవకాశాల కోసం వారు ప్రయత్నాలు సాగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనీ, తెరాస పాలనపై ప్రజలు విసుగుచెంది ఉన్నారంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుంటారు. అయితే, ముందుగా సొంత పార్టీలో లోపాలను సరిదిద్దుకోకుండా… తెరాస ఎదుర్కొనే వ్యూహాలను రచించేస్తున్నారు! ఇంకోపక్క రాష్ట్రంలో సోలోగా ఎదిగేందుకు సిద్ధమౌతున్న భాజపా కూడా ఆ పార్టీకి కొత్త సవాళ్లు విసురుతున్నట్టే లెక్క. ఇవన్నీ తట్టుకోవడం కోసం తాజాగా ఓ వ్యూహంతో కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే, ఆ వ్యూహాన్ని బహిర్గతం చేయడంలోనే ఆ పార్టీ పనితీరు సరిగాలేదని ఇట్టే అర్థమైపోతోంది. ఇంతకీ ఆ వ్యూహం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలోకి నాయకులను ఆకర్షించడం!
తెలంగాణలో భాజపా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతల్ని ఆకర్షించాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఈ మధ్య కొన్ని కథనాలు వచ్చాయి. త్వరలోనే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. ఆయన సమక్షంలో కొంతమంది నేతలు భాజపా తీర్థం పుచ్చుకోవచ్చే ఊహాగానాలు ఓపక్క వినిపిస్తున్నాయి. మరి, భాజపా వ్యూహాన్ని తిప్పికొట్టడం కోసమో… కేసీఆర్ ను ఎదుర్కోవడం కోసమో తెలీదుగానీ.. కాంగ్రెస్ లోకి కూడా పెద్ద సంఖ్యలు నాయకులు చేరబోతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పడం విశేషం! అధికార పార్టీకి చెందిన ఓ ఎనిమిది మంత్రులు, మరో 15 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారంటూ ఆయన చెప్పారు. సరైన సమయం చూసుకుని వారు కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. గతంలో కాంగ్రెస్ నుంచి తెరాసకు వెళ్లిన కొంతమంది నాయకులు తమకు కోవర్టులుగా పనిచేస్తున్నారనీ, వారు కూడా సరైన సమయం కోసం చూస్తున్నారనీ, అయితే వచ్చినవారందరినీ పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది అధిష్ఠానం ఖరారు చేస్తుందని భట్టి విక్రమార్క చెప్పడం గమనార్హం.
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో చాలామంది మంత్రులూ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురౌతున్నారనీ, వారితోపాటు తెలుగుదేశం పార్టీకి చెందినవారు కూడా తమవైపే చూస్తున్నారనీ, వారు ఎవరనేది ఇప్పట్లో బయటపెట్టలేమని భట్టి చెప్పారు. ఇంతకీ.. కాంగ్రెస్ వైపు ఇంత మోజుగా తెరాస నేతలు ఎందుకు చూస్తున్నారని ఆయన్ని అడిగితే.. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందనీ, అందుకే నాయకులంతా తమవైపు మొగ్గుతున్నారని భట్టి చెప్పారు!
వాస్తవంగా మాట్లాడుకుంటే… ఇది తెర వెనక ఉండాల్సిన వ్యూహం. అంతేగానీ, ప్రెస్ మీట్ పెట్టేసి.. అందరూ వచ్చి చేరిపోతున్నారహో అని చాటింపు వేసుకునే ఘనకార్యం కాదుకదా. ఒకవేళ కాంగ్రెస్ లో చేరేందుకు ఎనిమిది మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటే… వారిని ప్రభుత్వం నుంచి ఒకేసారి బయటకి తీసుకొచ్చి ఝలక్ ఇవ్వాలి. అంతవరకూ ఇలాంటి ప్లానింగ్ లో కాంగ్రెస్ ఉందనే వాసన కూడా బయటకి పొక్కనీయకూడదు! అప్పుడది సరైన వ్యూహం అవుతుంది. అంతేగానీ.. చాలామంది వచ్చేస్తున్నారూ, పేర్లు ఇప్పుడు చెప్పలేం అని ప్రకటిస్తే తెరాస అప్రమత్తం కాకుండా ఉంటుందా..? తెలుగుదేశం జాగ్రత్తపడకుండా ఉంటుందా..? భాజపా భయపడిపోతుందా..? తమ పార్టీ నాయకుల్ని భాజపా వైపో.. లేదా మరో పార్టీ వైపో వెళ్లకుండా ఇలాంటి ప్రకటనలు ద్వారా ఆపొచ్చని భావిస్తున్నట్టున్నారు. అలా అనుకున్నా ఇది సరైన వ్యూహం ఎలా అవుతుంది..?