ఎమ్మెల్యేలంతా వరుసపెట్టి.. టీఆర్ఎస్లో చేరిపోతూండటంతో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. ఇప్పటికి ఐదురుగు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో.. ఓటమి ముందే ఖరారరయింది. మంగళవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డి బరిలో నిలిఛారు. 5 ఖాళీలకు ఐదుగురు అభ్యర్థులతో టీఆర్ఎస్, ఎంఐఎం నామినేషన్లు వేయించారు. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినట్లుగా ఆత్రం సక్కు, రేగ కాంతారావు.చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ ప్రకటించారు. సబితా ఇంద్రా రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం మేం ఒక సీటు గెలవాల్సి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని ఆశించామన్నారు. అక్రమ మార్గాల్లో కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. అధికార పార్టీ వికృత రాజకీయ చేష్టలకు పాల్పడుతోందని.. ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రాముఖ్యతను తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనన్నారు. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలని రాజ్యాంగాన్ని తొక్కేసి లాభపడాలని ఆలోచన కేసీఆర్ చేస్తున్నారన్నారు. స్పీకర్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు మద్దతిచ్చామని ఉత్తమ్ గుర్తు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వ లోపంతో కొట్టు మిట్టాడుతోంది. పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు అభయం ఇచ్చే నాయకుడు లేకపోవడంతో.. ఎమ్మెల్యేలు ఎవరికీ భరోసా ఉండటం లేదు. దాంతో…రాజకీయ ప్రయోజనాలో.. వ్యక్తిగత ప్రయోజనాలో కానీ.. మొత్తానికి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీలు మారిపోతున్నారు. ఇప్పటికి ఐదుగురు అయ్యారు. త్వరలో మరికొంత మంది వస్తారని చెబుతున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్న విధంగా.. కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.