తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి పోరుబాట పట్టే ప్రయత్నం చేస్తోంది. నాగార్జునసాగర్‌లో టీ.పీసీసీ కార్యవర్గ సమావేశంలో నేతలంతా.. ఐక్యంగా తమ వాదన వినిపించారు. ఏం చేయాలో చర్చించుకున్నారు. అవినీతి విషయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిపుణులతో కమిటీ వేయాలని.. కార్యవర్గం నిర్ణయించింది. కొత్త సచివాలయం, అసంబ్లీ నిర్మాణాలపై పోరాటాలు చేయాలని నిర్ణయించారు. కొత్త అసెంబ్లీ అవసరం లేదని పాత సచివాలయం కూల్చివేయొద్దని కాంగ్రెస్ తీర్మానించింది. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆపాలని .. రోడ్ల మీదకొచ్చి పోరాటాలు చేయాలని నేతలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా జైల్ భరో, ఇతర కార్యక్రమాలు చేపడదామని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు కోసం కృషి చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.
జులై 1,2,3, 4 తేదీల్లో కొత్త జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. జులై 6, 7, 8 తేదీల్లో మున్సిపల్ స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. కొత్త, పాత మున్సిపాల్టీలకు కొత్త కమిటీల ఏర్పాటు చేస్తారు. పార్టీ పదవుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు నేతలు. రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా కొనసాగాలని తీర్మానం పంపించనున్నారు. సోమవారం జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు సచివాలయాన్ని పరిశీలించి పోరాట కార్యాచరణ ఖరారు చేయనున్నారు. కాళేశ్వరం అడ్డుకుంటున్నారన్న తప్పుడు భావన రాకుండా జాగ్రతగా పడాలని నిర్ణించారు. సమావేశంలో పలువురు నేతలు… తమ ఆలోచనలు చెప్పారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో స్కామ్ జరిగిందని జీవన్‌రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. తెలంగాణ భవిష్యత్‌ను నాశనం చేయడానికే మహారాష్ట్రతో ఒప్పందమని…ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి పాదయాత్ర చేయాలన్నారు.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు…రూ.38 వేల కోట్ల ఖర్చుతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్న అభిప్రాయం కాంగ్రెస్ వ్యక్తం చేసింది. రూ.5 వేల కోట్లతో పూర్తయ్యే మిషన్ భగీరథకు రూ.50వేల కోట్లు ఖర్చు చేశారని.. పైపుల కంపెనీల కోసమే మిషన్ భగీరథ అన్న చర్చ నడిచింది. ముఖ్యనేతలంతా మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యతతో పనిచేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కాళేశ్వరం 20శాతం పూర్తికాకున్నా హడావుడిగా ప్రారంభించారని విమర్శించారు. కొత్త జిల్లాల వారీగా దత్తత తీసుకొని పార్టీని బలోపేతం చేద్దామన్నారు. కాంగ్రెస్ నేతలంతా తమకు తాము ధైర్యం చెప్పుకుని భవిష్యత్ ఉందని నమ్మకం పెంచుకున్నారు. అయితే.. జగ్గారెడ్డి మాత్రం భిన్నంగా వ్యవహరించారు. ఇలాంటి చర్చల వల్ల ఉపయోగం ఉండదంటూ.. మైక్ విసిరేసి అసహనం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి తీరుపై సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు.