తెలంగాణా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి దేశంలో అందరి దృష్టి ఆకర్షించారు. దానికి హాజరుకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అందరి విమర్శలు మూటగట్టుకొంది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ఘోర తప్పిదాలను, ప్రదర్శించిన అలసత్వాన్ని, లంచాల బాగోతాల గురించి ఆయన తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మరింత బాగా వివరిస్తుంటే, అవి వింటూ కూర్చోలేమనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్, తెదేపా పార్టీల సభ్యులు ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టాయి. ఇంతవరకు భాజపా ఒక్కసారి కూడా రాష్ట్రంలో అధికారంలో రాలేదు కనుక దానికి ఇబ్బందేమీ ఉండదు. కనుక ఆ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమానికి హాజరయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అందరినీ ఆకట్టుకొంది. దానిపై మీడియాలో కూడా చాలా చర్చ జరిగింది. ఎక్కువ మంది మెచ్చుకొన్నారు. కొన్ని విమర్శలు కూడా వినిపించేయి. దానికి పోటీగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ కూడా సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి సిద్దం అవుతోంది. అయితే శాసనసభలో కాదు కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో. శాసనసభలో తాము కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అనుమతించాలని స్పీకర్ మడుసూధనాచారిని కోరినప్పటికీ ఆయన అనుమతి ఇవ్వనందున ఈనెల 9న గాంధీ భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నట్లు తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియాకు తెలియజేసారు.
కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉద్దేశ్యం గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ఎత్తి చూపి, దాని వలన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించి, తమ ప్రభుత్వం వాటిని ఏవిధంగా చక్కదిద్దబోతోందో వివరించడమయితే, తెలంగాణా కాంగ్రెస్ ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉద్దేశ్యం కేసీఆర్ చేసిన ఆరోపణలన్నిటినీ ఖండించి, ఆయన ప్రభుత్వం ఘోర తప్పిదాలు చేయబోతోందని నిరూపించడమే.
కేసీఆర్ ఏవిధంగా గూగూల్ మ్యాపుల సహాయంతో తమ తప్పులను ఎంచి చూపారో, టీ-కాంగ్రెస్ కూడా అదేవిధంగా ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ శుద్ధ దండుగని, దాని వలన ప్రభుత్వంలో పెద్దలకు, కాంట్రాక్టర్లకు తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండబోదని నిరూపించాలనుకొంటోంది. టీ-కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో తెలంగాణా ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న మేడిగడ్డ, తుమ్మిడిహట్టి తదితర ప్రాజెక్టులలో లోపాల గురించి, వాటి వలన ప్రజలకు జరుగబోయే నష్టాల గురించి వివరించబోతోంది. అలాగే పాలమూరు-రంగారెడ్డి, మిషన్ భగీరథ మొదలయిన ప్రాజెక్టులలో లోపాలు, అవినీతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వివరించాలనుకొంటోంది. తెలంగాణా ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ అశాస్త్రీయమయినదని నిరూపించాలనుకొంటోంది. గాంధీ భవన్ లో ఇవ్వబోయే ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇంతవరకు రాజకీయ నేతలు కేవలం నోటి మాటలతోనే యుద్ధాలు చేసుకొనేవారు. ఆ తరువాత ఫ్లెక్సీ బ్యానర్ల ద్వారా కొంత కాలం యుద్ధాలు సాగాయి. కొనేళ్ళ క్రితమే ఇంకొంచెం ‘అప్ గ్రేడ్’ అయ్యి ఫేస్ బుక్, ట్వీటర్ మాధ్యమాల ద్వారా ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపించుకొని విమర్శించుకొంటున్నారు. తరువాత లెవెల్లో వాళ్ళు దేనికి ‘అప్ గ్రేడ్’ అవుతారో చూడాలి.