అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా నిరుత్సాహ ఛాయలు తొలుగుతున్న వాతావరణం కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో పోరాటం చెయ్యలేకపోయిందనేది ఆ పార్టీ నేతలే అనుకుంటున్నమాట! త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలున్నాయి. జెడ్పీలపై పట్టు సాధించేందుకు తెరాసకు ధీటుగా గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అయితే, ఆ పార్టీకి ఇప్పుడు ఆర్థిక కారణాలు ఓ సమస్యగా మారుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది!
నిజానికి, లోక్ సభ ఎన్నికల సందర్భంలోనూ ఇదే మాట కొంత వినిపించింది. ఎలాగూ తెరాస మంచి ఫామ్ లో ఉంది కదా, లోక్ సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించే వాతావరణం కనిపిస్తోంది కదా, కాబట్టి మనం వ్యయప్రయాసలు తగ్గించుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయం కొంతమంది నేతల్లో వ్యక్తమైందని అప్పట్లో గుసగుసలు వినిపించేవి. అందుకే, లోక్ సభ ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచార సభలు, వాటికి ఖర్చుల విషయంలో పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులే ఆచితూచి ముందుకెళ్లారని అప్పట్లో అనుకున్నారు. అయితే, ఇప్పుడీ పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఒక కొత్త వ్యూహంతో జెడ్పీ ఎన్నికలకు సిద్ధమౌతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా… జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించేసింది రాష్ట్ర కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా ముందుగా ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన చరిత్ర లేదు.
తెరాసను ధీటుగా ఎదుర్కొనే వ్యూహంలో భాగమే ఈ ముందస్తు చర్య అని రాష్ట్ర నేతలు చెప్పుకుంటూ ఉన్నా… ఆర్థిక కారణాలే అభ్యర్థుల ప్రకటనలకు అసలు కారణంగా తెలుస్తోంది! జిల్లాలో పట్టు నిలబెట్టుకోవాలంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీను పెద్ద ఎత్తున గెలిపించుకోవాల్సి ఉంటుంది. నియోజక వర్గాలవారీగా ఈ ఎన్నికల ఖర్చును భరించే స్థితిలో గత ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధంగా లేని పరిస్థితి! గెలిచినవారు కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉందట! దీంతో, జిల్లా పరిషత్ ఛైర్మన్ ను ముందుగా నిర్ణయించేస్తే… రాబోయే ఎన్నికల్లో ఖర్చులను సదరు అభ్యర్థులు భరిస్తారనే వ్యూహంతో కాంగ్రెస్ వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ముందస్తు అభ్యర్థుల ప్రకటనలను తెరాస ఆయుధంగా మార్చుకునే అవకాశాలే లేకపోలేదు! కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీలుగా బరిలోకి దిగిన ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి! వారిద్దరూ కాంగ్రెస్ ప్రకటించిన ఛైర్మన్ అభ్యర్థులు కావడం విశేషం!