కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అలా రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారంటూ… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మైండ్ గేమ్ ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాకు ప్రగతి భవన్ నుంచి లీకులు వస్తూ ఉన్నాయి. పన్నెండు మంది ఏ క్షణమైనా చేరవచ్చని… చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం.. అందుకే ఆపామని… మరో వైపు నుంచి బిస్కెట్ వేస్తున్నారు. ఈ పరిణామాలతో…. కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది ఎమ్మెల్యేలు మిగులుతారో… అర్థం కని పరిస్థితి.. ఆ పార్టీ అగ్రనేతలకు ఉంది. ఆ టెన్షన్ అలా సాగుతూండగానే.. ఇప్పుడు… మండలిలో అసలు ఉనికే లేకుండా పోతుందా.. అన్న భయం కూడా వెంటాడటం ప్రారంభమయింది.
ప్రస్తుతం శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి , టీ సంతోష్ కుమార్ , ఆకుల లలిత , రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరో ఎమ్మెల్సీ ఉండేవారు కానీ..ఆయన ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో ముగ్గురి పదవి కాలం..మార్చితో ముగుస్తుంది. షబ్బీర్ అలీ, సంతోష్, పొంగులేటిలు మార్చి తర్వాత మాజీలవుతారు. మరో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.. రాజీనామా చేయక తప్పని పరిస్థితి. అంటే.. ఆకుల లలిత ఒక్కరే కాంగ్రెస్ పార్టీకి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తారు.
టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ లు భూపతి రెడ్డి , యాదవ్ రెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలను.. టీఆర్ఎస్ అలా సహించే అవకాశం లేదు. వారందరిపై వేటు వేసి.. కొత్త వాళ్లకు ఇచ్చేందుకు కసరత్తు కూడా ప్రారంభించింది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్సీ స్థానం వస్తుంది. కానీ.. ఎమ్మెల్యేలు జంప్ అయితే మాత్రం అది కూడా రాదు. ఎలా చూసినా… కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే తెలంగాణ ఇచ్చిన పార్టీకి రక్తకన్నీరు తెప్పిస్తోంది