ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా టీ కాంగ్రెస్ చేపట్టిన ముట్టడి.. రేవంత్ షోగా మారింది. ఆ కార్యక్రమానికి రేవంత్ పిలుపునిచ్చారు. తానే దగ్గరుండి పర్యవేక్షించారు. స్వయంగా.. తానే.. ప్రగతి భవన్ వరకూ వెళ్లి… పిలుపునిచ్చి సరిపెట్టే నేతను కాదని నిరూపించారు. చాలా వరకూ.. ఈ ప్రోగ్రాం ప్రభుత్వాన్ని కూడా టెన్షన్ పెట్టింది. బేగంపేట మెట్రో స్టేషన్ ను కూడా మధ్యాహ్నం వరకూ మూసేయడమే దీనికి కారణం. అయితే.. ఇప్పుడు.. రేవంత్ రెడ్డి ముట్టడిని ఎదుర్కొంటున్నారు. టీ కాంగ్రెస్ నేతలంతా.. అసలు ముట్టడి కార్యక్రమాన్ని ఎవరు చేపట్టమన్నారంటూ.. రేవంత్ పై… ఎటాక్ ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడి ప్రకటన చేసే ముందు దామోదర రాజనర్సింహ్మ .. షబ్బీర్ అలీలతో గాంధీభవన్ లో సమావేశమయ్యారు. పార్టీలో మిగతా సీనియర్లకు సమాచారం అందలేదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా మీడియా ప్రకటనే చేశారంటున్నారు. అందుకే సీనియర్ నేతలు ముట్టడి కార్యక్రమానికి అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే.. ముట్టడి సక్సెస్ కావడంతో.. క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో పడిపోయింది. పార్టీలో నాయకులంతా సమైక్యంగా కార్యక్రమం చేపట్టక పోయినా .. సక్సెస్ కావడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రేవంత్ ఏకపక్షంగా ఎలా కార్యక్రమాన్ని ప్రకటిస్తారంటూ ఫైరవుతున్నారు.
సీనియర్లు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రేవంత్ వైఖరిపై చర్చించారు. భట్టి విక్రమార్క, సంపత్ కుమార్,మధుయాష్కీ,వంశీ చంద్ రెడ్డి, వీహెచ్ , కోదండ రెడ్డి లాంటి వాళ్లు ఈ సమావేశానికి వచ్చారు. రేవంత్ ఒంటెద్దు పోకడతో ఇష్టానుసారం పార్టీ తరుపున ప్రకటనలు చేస్తూ .. కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతే ఎలా అంటూ .. నేతలు అసహనానికి గురయ్యారు. రేవంత్ వైఖరిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. టీ కాంగ్రెస్లో పని చేసేవాళ్లు తక్కువ. పని చేసేవాళ్లను చెడగొట్టవారు ఎక్కువన్న సూత్రం.. రేవంత్ వ్యవహారంలో మరోసారి బయటపడుతోందని ఇతర పార్టీల నుంచి సెటైర్లు పడుతున్నాయి.