ఈ నెల 6న భాజపాలో చేరేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమౌతున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికే ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం నుంచి కూడా నోటీసులు అందుకున్నారు. అయితే, కోమటిరెడ్డిపై చర్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదు! మరో రెండ్రోజుల్లో ఆయన పార్టీ మారబోతున్న నేపథ్యంలో… భాజపా కండువా కప్పుకోక ముందే ఆయనపై వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఒక నివేదిక పార్టీ హైకమాండ్ కి చేరింది. ఆ తరువాత, మరో నివేదిక కూడా రాష్ట్ర కమిటీ నుంచి ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ తీరు ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేదిగానే ఉందని దాన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు జరుగుతున్నప్పుడు రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాపై… ఆయనే పార్టీకి పట్టిన శని అన్నట్టు వ్యాఖ్యానించారు. మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి… సొంత నియోజక వర్గంలో గెలవలేనివారు, పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లడమేంటని చేసిన వ్యాఖ్యల్ని కూడా ఇప్పుడు మరోసారి హైకమాండ్ ముందున్న నివేదికలో ప్రస్థావించారని సమాచారం.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ, కోమటిరెడ్డిపై వెంటనే వేటు వేయాలనే ఆలోచనకు వచ్చినట్టుగా ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. పార్టీ మారకముందే వేటు వేస్తేనే శ్రేణులకు మంచి సంకేతాలు వెళ్తాయనేది అధినాయకత్వం ఆలోచనగా చెబుతున్నారు. అయితే, మరో రెండ్రోజుల్లో రాజగోపాల్ పార్టీ మార్పునకు ముహూర్తం పెట్టుకున్నట్టు సమాచారం. ఇప్పుడు హుటాహుటిన చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ కి పెద్దగా కలిసొచ్చే అంశం అవుతుందా..? ఈ చర్యలేవో ఆయన విమర్శలు చేయడం మొదలుపెట్టినప్పుడే తీసుకుని ఉంటే, ఏఐసీసీ చాలా సీరియస్ గా ఉందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోకి వెళ్లేది. పార్టీ నుంచి వేటుకు గురైన నేతగా కొన్నాళ్లైనా రాజగోపాల్ మీద కొంత చర్చ జరిగి ఉండేది కదా!