మునుగోడులో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తమదైన వ్యూహం అవలంభిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గ ప్రజల్లో ఉద్యమ వేడి ఇంకా ఉంది. సెంటిమెంట్ ఉంది. అలాగే అక్కడ ప్రజల్లో కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ. కమ్యూనిస్టు పార్టీలకు కనీసం ఇరవై వేల ఓట్లు ఉంటాయని అంచనా. ఇలాగే ఉద్యమకారులు కూడా అక్కడి ఓటర్లను ప్రభావితం చేయగలరు. అందుకే అన్ని పార్టీలూ ఇప్పుడు ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చే పక్షాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పుడు అందరి చూపు కమ్యూనిస్టులపై పడింది. వారు ఎవరికి మద్దతిస్తే వారికి అడ్వాంటేజ్ అవుతుంది. ఉపఎన్నికల్లో వారు పోటీ చేసే అవకాశం లేదు. ఎవరో ఒకరికి మద్దతివ్వాలి. తమకే మద్దతు అని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జాతీయ స్థాయి నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కమ్యూనిస్టు నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకులు కాంగ్రెస్ వైపు.. లోకల్ నేతలు టీఆర్ఎస్ వైపు మొగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. వారిని ఆకట్టుకోవడానికి కేసీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ కోదండరాం మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఆయనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు కోదండరాం మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఇలా ఏ కొద్ది మందిని ప్రభావితం చేసే వారైనా సరే.. వారి మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన రాక ముందే… రాజకీయం జోరుగా సాగుతోంది.