తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఆయనకు పీసీసీ పీఠం దక్కకుండా అధిష్టానం పెద్దల వద్ద పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించేందుకు హై కమాండ్ రెడి అయిందన్న వార్తలతో సీనియర్లు అలర్ట్ అయ్యారు. పార్టీలో సంక్షోభం తర్వాత ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సోనియా రేవంత్ రెడ్డికి మాత్రం కుటుంబసమేతంగా కలిశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికలు, నియోజక వర్గాలు పెరిగితే అనుసరించాల్సిన వ్యూహాలు, పెరక్కపోతే ఎలా ముందుకు వెళ్లాలనే సమగ్ర సమాచారంతో రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
దాంతో ఫిదా అయిన అధిష్టానం పెద్దలు రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో సీనియర్లు హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు పీసీసీ పగ్గాలు దక్కకుండా హస్తినలో మకాం వేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్ సహా పలువురు నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. పీఠం కోసం తామంతా పోటీ పడకుండా ఉత్తమ్ నే కొనసాగించాలని అధిష్టానానికి సూచిస్తున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఆయన్నే కొనసాగించాలని చెబుతున్నారు. దీంతో కుంతియా కూడా.. ఇదే మాట చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు చూసి.. నిర్వీర్యమైపోతున్నా…కాంగ్రెస్ లో మార్పు రాదని.. సెటైర్లు పడుతున్నాయి.