తెలంగాణలో ఎలాగైనా ఈ సారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ … బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాల మధ్యలో నలిగిపోకుండా తనదైన రాజకీయ వ్యూహం పాటించేందుకు ప్రయత్నిస్తోంది. రెండు, మూడు స్థానాల్లో ఉపఎన్నికలు తీసుకు వచ్చి పోటీ అంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉందన్న వాతావరణం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానం కాంగ్రెస్‌లో ఏర్పడింది. దీనికి రాజగోపాల్ రెడ్డిని పావుగా వాడుకోవాలని డిసైడ్ కావడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది.
మునుగోడులో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేస్తే..అక్కడ కాంగ్రెస్ తరపున అన్న కోమటిరెడ్డిని బరిలోకి దింపుతామని సంకేతాలు పంపింది. ఈ సవాల్‌ను వెంకటరెడ్డి కూడా తీసుకోక తప్పదు. తన తమ్ముడికి వ్యతిరేకంగా పోనని ఆయన చెప్పే చాన్స్ లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచే పోతున్నారు. ఆయనను ఓడించి తీరాల్సిందేనని.. అక్కడ కాంగ్రెస్ గెలవాల్సిందేనని హైకమాండ్ చెబుతోంది.
ఒక వేల వెంకటరెడ్డి పోటీ చేయనంటే.. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇదిపెద్ద కోమటిరెడ్డి రాజకీయ జీవితానికి మంచిదికాదు. బయట చెప్పుకుంటున్న నిజంగానే సోదరుల మధ్య తేడాలంటే.. అక్కడ పోటీ అన్నదమ్ముల సవాల్ అవుతుంది. అదే జరిగితే టీఆర్ఎస్ నలిగిపోతుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయం మాత్రం జోరుగా సాగుతోంది. మునుగోడు ఉపఎన్నిక అంటూ వస్తే.. రాజకీయం హీటెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.