టీ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టుతున్న నేతలపై వేటు మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పదేపదే విమర్శిస్తూ, రాజీనామా చేస్తానంటూ చెప్పుకొస్తున్న జగ్గారెడ్డికి పార్టీ పదవులన్నీ కట్ చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇచ్చిన అదనపు బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తొలగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించారు. హైకమాండ్ ఆదేశాలు లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సస్పెండ్ చేయలేదని అంటున్నారు.
జగ్గారెడ్డిపై ఒక విధంగా వేటు పడటంతో.. పార్టీలో ఇంకా ఎవరిపై చర్యలు తీసుకుంటారనే సందిగ్ధత మొదలైంది. హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నందున పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు రాబోతున్నాయని చెబుతున్నారు. వీరందరికీ మరోసారి హెచ్చరికలు జారీ అవుతాయని పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. ఏఐసీసీ నుంచి వార్నింగ్వచ్చినా పద్ధతి మార్చుకోకుంటే వేటేస్తారంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్‌లకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. రెండ్రోజుల్లో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు రాష్ట్రానికి వెళ్లాలని ఏఐసీసీ సూచించింది. బోస్‌రాజు వచ్చే వరకు షోకాజ్ నోటీస్ ఇస్తారా.. లేదా అనేది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
సీనియర్లను ఇలా చూసి చూడనట్లుగా వదిలేస్తే వారు ఇతర పార్టీల వ్యూహం ప్రకారం వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని.. కొంత మందిపై వేటు వేస్తేనే ప్రయోజనం ఉంటుందని రేవంత్ వర్గీయులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. రేవంత్ పార్టీకోసం ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడే జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి వాళ్లు బయటకు వచ్చి.. కాంగ్రెస్ వ్యతిరేక మీడియాకు ప్రచారం కల్పించే అవకాశం కల్పిస్తున్నారని అంటున్నారు. మొత్తంగా పంజాబ్ పరిస్థితుల్ని చూసైనా మారాల్సిన నేతలు మారకపోవడంతో.. వేటు వేసి దారికి తేవాలని ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.