తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇవాళ్ల హైదరాబాద్ లో ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి అంటే కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తాడు, మంచి పదాలతో తిడతాడు అని తన శతృవులు ఒక ముద్ర వేయాలని అనుకుంటున్నారన్నారు. ఆ ముద్రను చెరపాలంటూ మీడియాని కోరారు. పరిపాలన పట్ల తనకు చాలా స్పష్టత ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించడంలో తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. కాబట్టి, నెక్ట్స్ లీగ్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి పాత్రను మీడియా ద్వారా ప్రజలకు చెప్పదల్చుకున్నా అన్నారు. ఇన్నాళ్లూ తాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చాననీ, రాబోది కాంగ్రెస్ ప్రభుత్వమనీ, పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడానికి పరిణితి చెందిన నాయకుడిగా తన అభిప్రాయాలు పంచుకున్నా అన్నారు.
మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ… బాల్ థాక్రే ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేదన్నారు, సోనియా గాంధీ ప్రధాని కాలేదన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది ఎన్నికైన శాసన సభ్యులు నిర్ణయిస్తారన్నారు. కానీ, ఎవరు ముఖ్యమంత్రి అయినా తన ఆలోచనల్ని పంచుకుంటాననీ, పార్టీపరంగా తాను రెండో స్థానంలో ఉన్నానని రేవంత్ చెప్పడం గమనార్హం. ఇక, కేసీఆర్ సర్కారుపై యథావిధిగా విమర్శలు చేశారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీయేటా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. ఆంధ్రా పార్టీతో కాంగ్రెస్ జతకట్టిందనే కేసీఆర్ విమర్శలపై స్పందిస్తూ… ముఖ్యమంత్రి అమరావతికి పోయినప్పుడు ఆంధ్రోళ్లు గుర్తుకు రాలేదా, విజయవాడ వెళ్లి పైన అమ్మవారినీ, కింద కమ్మవారిని కౌగిలించుకున్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు? ఛండీయాగం చేసుకున్నప్పుడు చంద్రబాబు, వెంకయ్య నాయుడుని పిల్చుకున్నావుగానీ… కోదండరామ్, విమలక్కల్ని పిలిచావా అని కేసీఆర్ ని ప్రశ్నించారు రేవంత్.
మహా కూటమిలో ఐదు శాతం ఇతర పార్టీలకు ప్రాధాన్యత ఉందనీ, వారే రాష్ట్రాన్ని నడుపుతారంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ లకు ఇక్కడ ఓటు హక్కు లేదన్నారు. ఎన్నికల తరువాత కేటీఆర్ అమెరికాకి వెళ్తారనీ, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పోవాల్సిందే… హరీష్ రావు కోరుకుంటున్నదీ ఇదే అంటూ మళ్లీ ఈ అంశాన్ని టచ్ చేశారు. ఇక, ఇతర విషయాలు విమర్శలూ ఎలా ఉన్నా… కాంగ్రెస్ లో తాను రెండో స్థానంలో ఉన్నాననీ, పరిపాలన దక్షత తనకు పరిపూర్ణంగా ఉందనే ఇమేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ చెప్పడం కొంత ప్రత్యేకంగానే ఉంది. అంటే, కాంగ్రెస్ పార్టీలోని వారికి తన పాత్ర ఇదీ చాటిచెప్పుకునే ప్రయత్నమా… లేదంటే, కాంగ్రెస్ లో తన స్థాయి ఇదీ అని ప్రత్యర్థి పక్షాలకు చెప్పే ప్రయత్నమా అనేదే ఆసక్తికరం. లేదంటే… ఈ రెండు ప్రయోజనాలూ ఆశించే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అనుకున్నా అన్వయం అవుతున్నాయి మరి!