లాక్డౌన్ పేరుతో రెండు నెలల పాటు కోత పెట్టిన సగం జీతాలను చెల్లించాలని.. ఉద్యోగుల జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల, వచ్చే నెలలో మొత్తం చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నిజానికి బొప్పరాజు.. కోత వేసిన జీతాలను చెల్లించాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆయన వాయిస్ పెద్దగా బయటకు రావడం లేదు. అయితే.. సచివాలయ ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న వెంకటరామిరెడ్డి మాత్రం… బొప్పరాజు వాయిస్‌కు భిన్నంగా మాట్లాడుతున్నారు. తమకు “సామాజిక” బాధ్యత ఉందని .. ప్రభుత్వాన్ని జీతాల కోసం ఒత్తిడి చేయలేమని అంటున్నారు.
ఓ మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌పై… హైకోర్టు రెండు నెలల్లో వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలపై ఉద్యోగులు సంతృప్తిగానే ఉన్నారు. అయితే.. ప్రభుత్వానికి దగ్గరగా ఉండి… ప్రభుత్వ కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ.. సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుంటున్న వెంకటరామిరెడ్డి మాత్రం.. తమకు జీతాలు ఒక్కసారే వద్దని.. వాయిదాల్లో ఇచ్చినా చాలని.. వడ్డీ అసలే వద్దని అంటున్నారు. ఈ మేరకు కోర్టుకు కూడా వెళ్తామని ప్రకటన చేశారు. ఎవరైనా ఉద్యోగుల బహిరంగంగా మాట్లాడితే.. వారిపై వేధింపులు ఉంటాయి కాబట్టి ఎవరూ బయటకు రావడంలేదు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు మాత్రం… ఉద్యోగుల విషయంలో ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే…జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మామూలుగా జీతాలివ్వడానికే ఇబ్బంది పడుతోంది. అప్పుల కోసం టెన్షన్ పడుతోంది. ఇలాంటి సమయంలో బకాయిలు చెల్లించడం ఇబ్బందికరమే. అందుకే.. ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డితోనే పిటిషన్ వేయించి… విచారణ జరిగినంత కాలం.. ఆ జీతాల్ని పెండింగ్‌లో పెట్టవచ్చన్న ఆలోచన చేస్తున్నట్లుగా ఉద్యోగసంఘాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది తెలిసే బొప్పరాజు.. జీతం చెల్లించాలని ప్రకటన చేస్తున్నారని అంటున్నారు. ఈ ఇద్దరు ఉద్యోగ సంఘాల నేతలు.. చివరికి బకాయి జీతాలు ఇప్పిస్తారో లేదో ..!?