తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ రోజు రోజుకు గందరగోళంగా మారుతోంది. హైకోర్టు ప్రభుత్వం తీరుపై విచారణ జరినప్పుడల్లా తీవ్రంగా మండిపడుతోంది. బుధవారం విచారణలో.. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం .. పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లుగా లేదు. ఆ తీర్పు వచ్చిన ఒక్క రోజులో.. ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం… ప్రైవేటు ల్యాబుల్లో వైద్య ఆరోగ్య శాఖ జరిపిన పరీక్షల్లో లోపాలు బయటపడ్డాయని.. వాటన్నింటినీ నాలుగు రోజుల్లో సరి చేసుకోవాలని.. సరి చేసుకున్న తర్వాతే టెస్టులు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్టులు నిలిచిపోయాయి.
అయితే.. ప్రభుత్వం మాత్రం ఉచిత కరోనా టెస్టులను కొనసాగిస్తోంది. జంట నగరాల్లో మొత్తం 11 ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. అక్కడ ఉన్న టెస్టింగ్ సామర్థ్యం… ప్రస్తుతం బయట పడుతున్న కేసులతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటికే తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ.. ప్రైవేటు ల్యాబుల్లో నాలుగు రోజుల పాటు టెస్టుల్ని నిలిపివేసింది. గతంలో సేకరించిన శాంపిళ్లను మాత్రమే పరిశీలిస్తోంది. కొద్ది శాంపిళ్లతోనే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటు ల్యాబ్స్లోనూ నిలిపివేశారు. దీంతో కరోనా టెస్టులు మరింతగా తగ్గనున్నాయి.
కరోనా టెస్టింగ్ సామర్థ్యం పెంచుకోవడంలో తెలంగాణ సర్కార్ పూర్తి స్థాయి నిర్లక్ష్యం ధోరణిని ప్రదర్శించిందనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. హైకోర్టు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. లైట్ తీసుకుంది. ఆర్టీ పీసీఆర్, ట్రూ నాట్ టెస్టుల సామర్థ్యం పెంపు కోసం పెద్దగా దృష్టి పెట్టలేదు. పొరుగు రాష్ట్రాలు.. పెద్ద ఎత్తున టెస్టింగ్ చేసి… వైరస్ను కనిపెట్టి.. నియంత్రించడానికి ప్రయత్నిస్తూంటే.. తెలంగాణ సర్కార్ మాత్రం లైట్ తీసుకుంది. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.