తెలంగాణ ప్రభుత్వం ఆదాయం అడుగంటిపోయిన దశలో సంక్షేమంలో వెనుకడుగు వేయాలని అనుకోవడం లేదు. ఎన్ని కష్టాల్లొచ్చినా.. గతంలో ఇచ్చిన హామీల మేరకు రుణమాఫీ, రైతబంధు పధకాలకు దాదాపుగా రూ. 8,200 కోట్లు విడుదల చేసింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రూ. లక్ష రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. తొలి ఏడాది తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉండటంతో.. ఈ బడ్జెట్ నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించారు. నాలుగు విడతల్లో మొత్తం లక్ష రుణమాఫీ చేయాలనుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కరోనా వచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ఉద్యోగుల జీతాలే సగానికి తగ్గించాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో… రుణమాఫీ నిర్ణయాన్ని కేసీఆర్ వాయిదా వేస్తారేమోనని అనుకున్నారు. కానీ కేసీఆర్.. వెనక్కి తగ్గాలని అనుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం.. రుణమాఫీ చేసి తీరాలనే ఉద్దేశంతో నిధులు విడుదల చేశారు.
మొదటగా.. రూ. పాతిక వేల లోపు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయనున్నారు. ఇలాటి వారు దాదాపుగా ఆరు లక్షల మంది ఉంటారు. ప్రభుత్వం వారి సమాచారాన్ని బ్యాంకుల వద్ద నుంచి సేకరిస్తోంది. లక్ష రుణమాఫీని నాలుగు విడతల్లో చెల్లించాలనుకుంది.. పాతిక వేలు బాకీ ఉన్న వారికి ఏక మొత్తంలో ఒకే సారి చెల్లిస్తున్నారు. బ్యాంకులు జాబితా ఇవ్వగానే.. ఆటోమేటిక్గా వారి ఖాతాల్లో మాఫీ నగదు జమ అవుతాయి. మరో వైపు ప్రతిష్టాత్మక పథకం..రైతు బంధును ఆపేశారంటూ.. విపక్షాలు చేసిన విమర్శలపై కేసీఆర్ ప్రెస్మీట్లో ఘాటుగా స్పందించారు. తాను బతికున్నంత వరకు..టీఆర్ఎస్ ఉన్నంత వరకూ రైతు బంధు కొనసాగుతుందన్నారు. ఆ మేరకు ఆ పథకానికీ నిధులు విడుదల చేశారు.
రైతు బంధు పథకం కింద.. ఎకరానికి రూ.5 వేలు ఇస్తున్నారు. మొత్తం 1.40 కోట్ల ఎకరాలకు సరిపోను రూ.14 వేల కోట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. ఏటా రెండు సార్లు ఇస్తారు కాబట్టి.. ఈ వానా కాలం రైతు బంధు కోసం రూ. ఏడు వేల కోట్లు విడుదల చేయబోతున్నారు. గతంలో రైతు బంధు పథకాన్ని సమర్థంగా నిర్వహించారు. అందరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. గతంలో చెక్కులు పంపిణీ చేసేవారు. గతలో ఎన్నికల సమయంలో రైతు బంధు వచ్చింది. అప్పుడు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ విధానాన్ని వాడుకున్నారు. ఇక నుంచి ఇదే విధానంతో కంటిన్యూ చేయనున్నారు.
కేంద్రం నుంచి సాయం వస్తుందేమోనని కేసీఆర్ చాలా ఎదురు చూశారు. హెలికాఫ్టర్ మనీ సహా.. ఇతర ఆప్షన్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏప్రిల్ నెలలో తెలంగాణకు వచ్చింది రూ.982 కోట్లు మాత్రమే. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వనరుల ద్వారా రుణాలు.. సేకరించి.. సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి సాయం పొందేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.