కరోనా విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి రెండు వారాల గడువు కోరారు.. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. ప్రభుత్వం తీరుపై.. హైకోర్టుధర్మాసనం.. వరుసగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు.. సీఎస్ తో పాటు.. వైద్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విచారణకు ముందే.. సమగ్ర సమాచారంతో… కరోనా బులెటిన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 59 పేజీలు ఉన్నాయి. అయితే.. ఈ బులెటిన్‌లో తాము సూచించిన సమాచారం ఎందుకు లేదని ధర్మాసనం ప్రశ్నించింది. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, అలా పరీక్షలు నిర్వహించిన వారి వివరాలు బులిటెన్‌లో ఎందుకు లేవని ధర్మాసనం ప్రశ్నించింది.
తెలంగాణలో పరీక్షల సంఖ్య తక్కువగా ఎందుకు ఉంది? గాంధీలో కరోనా పరీక్షలు చేస్తున్నారా?లేదా? అంటూ అధికారులపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని ఆదేశాలను రెండు వారాల్లో అమలు చేస్తామని.. సోమేష్ కుమార్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. కరోనా పరీక్షలను క్రమంగా పెంచుతున్నామని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు… ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 21 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారన్న విషయాన్ని ప్రచారం చేయాలని సూచించింది. ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు పైనా ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. కరోనా మరణాలు తక్కువగా చూపుతున్నారన్న అంశాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి.. దాన్ని నమ్ముతున్నామని వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయించుకుని మొత్తం చదివానని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులు సులభంగా చేరేలా చూస్తామని.. సీఎస్ హామీ ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రులపై 726 ఫిర్యాదులు అందాయన్నారు. ర్యాపిడ్ టెస్టుల కోసం మరో 4 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను ఆర్డర్ చేసినట్లు హైకోర్టుకు సీఎస్ వివరణ ఇచ్చారు. చివరిగా హైకోర్టు ఆదేశాలన్నీ అమలు చేసేందుకు రెండు వారాలు సమయం కావాలని సీఎస్ కోరారు. దీంతో హైకోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఆ రోజున కూడా విచారణకు.. సీఎస్‌తో పాటు కీలక అధికారులు కూడా హాజరు కావాలని స్పష్టం చేసింది.
గత రెండు నెలలుగా.. ప్రభుత్వం తీరుపై.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఎదురుదాడి చేసే ప్రయత్నం కూడా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా.. ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని.. వినయపూర్వకంగా చెప్పడం మాత్రం.. ప్రభుత్వం తీర్పులో మార్పును సూచిస్తోందంటున్నారు.