కార్మిక సంఘాలతో చర్చలను ఆర్టీసీ యాజమాన్యం మ..మ అనిపించింది. కోర్టు ఆదేశం మేరకు.. చర్చలు జరిపామని.. ఆధారాలు చూపించుకోవడానికి చర్చలు జరిగినట్లుగా.. వ్యవహారం అంతా జరిగిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసుకు ఆర్టీసీ జేఏసీ నేతలలు వచ్చారు. కార్మిక సంఘాల నేతల్లో అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వాసుదేవరావు, వీఎస్ రావులను మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా వారిని గేటు వద్దనే అడ్డుకున్నారు. చర్చల మొత్తాన్ని వీడియో తీశారు. జేఏసీ నేతల ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయించారు. డిమాండ్లన్నింటిపై చర్చించాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఆయితే.. ప్రభుత్వ కమిటీ మాత్రం.. అంగీకరించలేదు. ఆర్థిక భారం లేని డిమాండ్లను మాత్రమే చర్చించాలన్నారు. దీనికి జేఏసీ నేతలు అంగీకిరంచలేదు. అక్కడితో చర్చలకు పుల్ స్టాప్ పడింది. జేఏసీ నేతలు బయటకు వచ్చేశారు.
శత్రుదేశాలతో కూడా ఇంత నిర్భంధంగా చర్చలు జరిగి ఉండవని.. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ.. 21 డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామంటోందని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. మా డిమాండ్లలో కొన్ని మినహాయించాలని కోర్టు చెప్పలేదన్నారు. డిమాండ్లపై అసలు చర్చించనే జరగలేదన్నారు. మా ఫోన్లు తీసుకోవడానికే వాళ్లకు అరగంట సమయం పట్టిందని .. చరిత్రలో తొలిసారి అధికారులు చర్చలను బాయ్‌కట్ చేశారని మండిపడ్డారు. ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని అశ్వత్థామరెడ్డి తేల్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని .. 30న సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
సోమవారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణలో.. చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ అనే భావన రాకుండా ఉండటానికే ప్రభుత్వం వ్యూహాత్మకగా.. తూ..తూ మంత్రంగా చర్చలు జరిపిందన్న ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి వస్తున్నాయి. చర్చల ప్రక్రియను రికార్డు చేసిన అధికారులు సోమవారం వాటిని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది. అయితే.. సమ్మెపై నిర్ణయం తీసుకునే హక్కు హైకోర్టుకు లేదని.. కేసీఆర్ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నారు.