ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేసి కొత్తది కట్టాలని.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని ఉన్న పళంగా ఖాళీ చేయాలని..అధికారులను ఆదేశించింది. ఆ భవనంలో ఉన్న డిపార్టుమెంట్లన్నింటినీ.. తరలించాలని స్పష్టం చేసింది. గత వారం.. కురిసిన భారీ వర్షానికి ఉస్మానియా ఆస్పత్రిలో నీరు పొంగి పొర్లాయి. దాంతో అదో పెద్ద రాజకీయ అంశం అయిపోయింది. రాజకీయ నేతలందరూ.. ఐదేళ్ల కిందట.. కేసీఆర్ చెప్పిన మాటల్ని.. గుర్తు చేసి… తీవ్రమైన విమర్శలు చేశారు. కేసీఆర్ మొదటి సారి సీఎం అయినప్పుడు… ఉస్మానియాను సందర్శించి… ఆ భవనం.. రెండు, మూడేళ్లలో కూలిపోయేలా ఉందని..కూల్చేసి కొత్తది కడతామని ప్రకటించారు.
కేసీఆర్ ఆ ప్రకటన చేసి.. ఐదేళ్లు అవుతున్నా.. కనీసం.. కొత్త భవన ప్రణాళికలు కూడా వేయలేదు. ఉస్మానియాది హేరిటెజ్ భవనం అని.. దాన్ని కూలగొట్టకుండా ఆదేశాలివ్వాలని కొంత మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారన్న కారణంగా ప్రభుత్వం సైలెంటయిపోయింది. అయితే ఇప్పుడు.. పురాతన భవనాలు కాకపోయినా… కూలిపోయే పరిస్థితి లేకపోయినా… సెక్రటేరియట్ భవనాలను కూల్చేసి.. కొత్తది కట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో… ఇప్పుడు ఆస్పత్రి ముఖ్యమా.. సెక్రటేరియట్ ముఖ్యమా.. అన్న చర్చను విపక్షాలు లేవనెత్తాయి. దీంతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడినట్లయింది.
ఓ వైపు.. శరవేగంగా… సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేసి.. శిథిలం అయిపోయిన ఉస్మానియాను అలా వదిలివేస్తే.. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని.. తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని కూల్చేసి.. కొత్త భవన నిర్మాణాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కోర్టులో ఉన్న పిటిషన్లను వీలైనంత త్వరగా క్లియర్ చేయించుకోవాలని అనుకుంటున్నారు. ఈ లోపు… మిగతా లాంఛనాలు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సారి విపక్ష పార్టీలు.. అడ్డుపడే అవకాశం ఉండదని ప్రభుత్వం అంచనా. సెక్రటేరియట్‌తో సమానంగా…శరవేగంగా ఉస్మానియా ఆస్పత్రిని కట్టిస్తే.. కేసీఆర్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది.