అవును మరి… బుద్ధుడి ప్రవచనాలు అద్భుతం అని భావిస్తూ తన జీవితంలో బుద్ద మార్గాన్ని అనుసరించిన బాబా సాహెబ్ అంబేద్కర్… హైదరాబాదుకే తలమానికమైన బుద్ధుడినే తల దన్నేలా ఆయనకు సమీపాన్నే కొలువు దీరబోతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయాలని సంకల్పించిన కేసీఆర్ ప్రబుత్వం.. అందుకు అనువైన స్థలంగా నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉన్న విశాలమైన స్థలాన్ని ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈ స్థలం కారు పార్కింగ్ తదితర సాధారణ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ప్రపంచానికే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ నిర్ణయించడం కొన్ని రోజుల కిందటే జరిగినప్పటికీ.. తాజాగా దానికి స్థల ఎంపిక నెక్లెస్ రోడ్డులో అని నిర్ణయించారు. ఈ స్థలంలో అంబేద్కర్ 125 వ జయంతి వేడుక అయిన 14వ తేదీన ఇదే స్థలంలో భూమి పూజ జరగబోతున్నది.
ఇప్పటిదాకా హైదరాబాదు నగరం అంటేనే తలమానికమైన దర్శనీయ ప్రదేశాలలో హుసేన్ సాగర్ లో వెలసిన బుద్ధ విగ్రహం కూడా చాలా ప్రముఖంగానే ఉన్నది. ఎన్టీఆర్ హయాంలో నగరానికే శోభ తెచ్చేలా ఈ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. 60 అడుగుల కంటె ఎక్కువ ఎత్తు ఉన్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా బుద్ధ విగ్రహం గా గుర్తింపు పొందింది.
అలాంటి బుద్ధ విగ్రహాన్ని ఆవరించి ఉన్నహుసేన్ సాగర్ గట్టునే ఇప్పుడు బౌద్ధాన్ని తన జీవన విధానంగా ఆచరించిన బాబా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 14న బూమిపూజ చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విగ్రహాన్ని ఆవిష్కరించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తానికి ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఈ అంబేద్కర్ విగ్రహం పూర్తయితే.. హైదరాబాదులోని ప్రధాన సందరర్శనీయ స్థలంగా రూపు దిద్దుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.