తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నది. ఆ పార్టీ నాయకులు అందరూ కూడా పండగ చేసేసుకుంటున్నారు. కానీ ఒకే ఒక్క నాయకుడిలో మాత్రం గుండెల్లో గుబులు రేగుతోంది. మామూలుగా కాదు.. చాలా తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగుతోంది. ఆ నాయకుడు మరెవ్వరో కాదు. మంత్రి తన్నీరు హరీష్‌రావు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ సాధించిన అద్భుతమైన ఫలితాలు.. అదే పార్టీకి చెందిన అంత కీలక సీనియర్ నాయకుడికి ఆందోళన ఎందుకు కలిగిస్తున్నాయా అనిపిస్తోంది కదా? వివరాల్లోకి వెళ్దాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లుడు తన్నీరు హరీష్‌రావు, కొడుకు కల్వకుంట్ల తారక రామారావు మధ్య పార్టీలో పైకి కనిపించని ఆధిపత్య పోరాటం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలి పరిణామాల్లో కేటీఆర్ తన ఆధిపత్యాన్ని చాలా స్పష్టంగా నిరూపించుకుంటున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపిక నుంచి నాంకేవాస్తే హరీష్‌ను ఇన్చార్జిగా పెట్టినప్పటికీ.. తన మనిషికి టిక్కెట్ ఇప్పించుకున్న కేటీఆర్.. అక్కడ చరిత్రలో లేని విజయాన్ని పార్టీకి అందించారు.
అలాగే గ్రేటర్ ఎన్నికలను పూర్తిగా తన ఒంటిచేత్తో నడిపించాడు. బావ హరీష్‌రావు నీడ కూడా గ్రేటర్ ఎన్నికల మీద పడడానికి వీల్లేదన్నట్లుగా ఆయన అంతా తానే అయి వ్యవహరించారు. ఇంతకూ హరీష్‌రావు స్వయంగా వచ్చి ప్రచారం నిర్వహించిన పటాన్చెరులో తెరాస ఓడిపోవడం మరో మెలిక. ఇప్పుడు గ్రేటర్ లో ఇంత భారీ విజయం నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ప్రతిష్ట, పార్టీపై పట్టు మరింత పెరిగినట్లే.
ఇదే సమయంలో అక్కడ మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఉప ఎన్నికకు హరీష్‌రావు ఇన్చార్జిగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న ఎమ్మెల్యే సీటు. దీని ఉప ఎన్నిక బాధ్యతను ఆయన చేతిలో పెట్టి.. నగరానికి దూరంగా పంపారు. ఇప్పుడు నగర ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో నారాయణఖేడ్ ఎన్నికలో తన సత్తా ఏంటో చూపించాల్సిన బాధ్యత హరీష్‌రావు ముందుంది. అక్కడ కూడా కేవలం గెలుపు కాదు.. చరిత్ర ఎరగనంత భారీ వ్యత్యాసంతో గెలుపు సాధిస్తే తప్ప.. పార్టీలో తన ప్రతిష్ట పెరగదనే భయం ఆయనకు ఏర్పడుతూ ఉండవచ్చు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఎవరికి ఎలాంటి అనుభూతులు కలిగించినా.. హరీష్‌రావుకు మాత్రం గుండెల్లో గుబులు రేపుతాయనడంలో సందేహం లేదు.