కరోనా నివారణ చర్యల విషయంలో తెలంగాణ హైకోర్టు నుంచి అదే పనిగా మొట్టికాయలు తింటున్న ప్రభుత్వానికి మొదటి సారి కాస్త రిలీఫ్ దొరికింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోందని నేటి విచారణలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకూ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ప్రభుత్వాన్ని, అధికారయంత్రాంగాన్ని విమర్శించాలనే ఉద్దేశం లేదని.. చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలనేదే మా ప్రయత్నమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా నియంత్రణకు యంత్రాంగం చాలా కష్టపడుతోందని.. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. సుమారు 99 శాతం పర్ఫెక్షన్ వచ్చింది. రానున్న రోజుల్లో ఇదే విధంగా పనిచేయాలని ధర్మాసనం సూచించింది.
గత విచారణలో రెండు వారాల్లో తమ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశిస్తూ..హైకోర్టు వాయిదా వేసింది. ఈ వాయిదా సమయానికి తాము కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక నివేదికను సమర్పించారు. కరోనా కట్టడి ఉన్న సౌకర్యాలన్నింటినీ సీఎస్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. టెస్టుల విషయంలోనూ సోమేష్ కుమార్ హైకోర్టును సంతృప్తి పరిచే ప్రయత్నంచేశారు. రాష్ట్రంలో రోజుకు 40వేల ర్యాపిడ్ టెస్టులు జరిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సీఎస్ తెలిపారు.గ్రేటర్లో కరోనా తగ్గు ముఖం పట్టిందన్నారు. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రీపగలు కష్టపడుతున్నామన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకోవాని .. విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్‌ను రద్దు చేయాలని ధర్మాసనం ప్రభు్తవాన్ని ఆదేశించింది. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ రేట్లను డీస్ప్లే బోర్డుల ద్వారా తెలపాలని .. ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత మందికి ఉచితంగా చికిత్స అందించారో తెలపాల్సిందేనని స్పష్టంచేసింది. ఢిల్లీ తరహా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించింది. తదుపరి విచారణకు వైద్యశాఖ అధికారులు హాజరుకావాలని ఆదేశించి.. విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. ఇప్పటి వరకూ.. ప్రభుత్వం తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు.. ఒక్క సారిగా సంతృప్తి వ్యక్తం చేయడంతో..తెలంగాణ అధికారులు రిలీఫ్ ఫీలయ్యారు.