తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన మాటల్లో కాస్త ఆవేదన కూడా వినిపిస్తోంది. తన నియోజక వర్గం హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ… పార్టీలో కొన్ని వ్యతిరేక పరిణామాలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తనకు పోరాడటం తెలుసుగానీ, దొంగ దెబ్బ తీయడం చేతగాదన్నారు. తాను ఇంతవరకూ ఎవ్వరి దగ్గరా చేయి చాచలేదనీ, తాను నమ్మినవారే మోసం చేస్తే కాస్త బాధకలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనని ఓడించాలంటూ గతంలో చాలామంది ప్రయత్నించారనీ, కానీ ప్రజలు ఎప్పుడూ ధర్మం తప్పరు అన్నారు ఈటెల. ఒకవేళ ప్రజలే ధర్మం తప్పి ఉంటే తను ఓడిపోయేవాడిననీ, నమ్మక ద్రోహం చేసేవారు ఎప్పటికీ బాగుపడరు అన్నారు. అవసరమైనప్పుడు ఎంత ఖర్చైనా తానే భరించాననీ, ఎవ్వర్నీ ఏదీ అడగకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నా అన్నారు. ఈటెల చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయం అవుతున్నాయి. గతంలో, అసలైన గులాబీ బాసులం మేమే అంటూ వ్యాఖ్యానించి, తీవ్ర చర్చకు కారణమయ్యారు.
ఈటెల ఇలా ఆవేదన వ్యక్తం చేయడానికి కారణం… సొంత జిల్లాలో నెలకొన్న ఆధిపత్య పోరు అని తెలుస్తోంది. ఈటెలకు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు ఒక వర్గంగా ఏర్పడ్డట్టు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీలో కొంతమంది ఈటెలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ, ఎలాగోలా ఈటెలను దెబ్బతియ్యాలనే కుట్ర జరుగుతోందని ఆ వర్గం వారు అంటున్నారు. జిల్లాలో పెరుగుతున్న గ్రూపు రాజకీయాలతో మంత్రి విసిగిపోతున్నారనీ, అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తే ఏమౌతుందో అన్నట్టుగా మథనపడుతున్నారనీ, ఈ నేపథ్యంలో ఏం చెయ్యాలో అనే ఆవేదనతోనే మంత్రి ఈటెల ఇలా స్పందిస్తున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి. నిజానికి, ఈ గ్రూపు రాజకీయాల అంశాన్ని ముఖ్యమంత్రి దగ్గరకి తీసుకెళ్తే.. ఆయన స్పందన ఎలా ఉంటుందో అనేదీ అనుమానంగానే ఉంది. ఎందుకంటే, గతంలో ఈటెల పనితీరుపై సీఎం కాస్త అసంత్రుప్తితో ఉన్నారనే కథనాలూ వచ్చాయి కదా. ఈటెల ఫిర్యాదు చేయకపోయినా… జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారస్థాయి చేరాయనేది ఆయన మాటల్లో చెప్పకనే చెప్పినట్టయింది. దీనిపై పార్టీ అధినాయకత్వం స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.