పాలేరు ఉపఎన్నికలలో తెరాస మళ్ళీ ఘన విజయం సాధించిన ఉత్సాహంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వంపై ఎవరైనా లేనిపోని విమర్శలు చేస్తే వారిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఈడుస్తానని హెచ్చరించారు. ఆ మాటలని ప్రతిపక్ష పార్టీల నేతలందరూ తప్పు పట్టారు. గట్టిగా ఖండించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలదే. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో కరువు పరిస్థితులను, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎంతసేపు ఎన్నికలు, ఓట్లు, పార్టీల ఫిరాయింపులపైనే దృష్టి పెడుతుంటే దాని లోపాలను ఎత్తి చూపితే ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులు పెడతాను..కోర్టులకి ఈడుస్తాను..అని బెదిరించడం సరికాదు. ఆయన బెదిరింపులకి మేమేమి భయపడిపోము. అవసరమైతే జైలుకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము,” అని భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తదితరులు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. తెలంగాణాలో నిరంకుశ పాలన సాగిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుదామని ప్రయత్నిస్తే చూస్తో ఊరుకోబోమని వెంకట రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిధంగా అని ఉండకపోయుంటే, పాలేరు ఎన్నికలలో ఓటమి కారణంగా దిగాలుపడి ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పట్లో మాట్లాడేందుకు ఇష్టపడేవి కావు. వాటి ఓటమి గురించి ప్రజలకు, మీడియాకి సంజాయిషీలు ఇచ్చుకొంటూ, ఆత్మవిమర్శ పేరిట పార్టీ నేతలు అంతర్గతంగా ఒకరితో మరొకరు కుమ్ములాడుకొంటూ కాలక్షేపం చేస్తుండేవారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికలు వారినందరినీ ఏకత్రాటి పైకి తీసుకువచ్చి ఎదురుదాడి చేసేందుకు అవకాశం కల్పించాయని చెప్పవచ్చు.