తెలంగాణా పిసిసి విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు జరుగబోతోంది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5వరకు సాగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హాజరవుతారు. టీ-కాంగ్రెస్ కి ప్రధానంగా రెండు సమస్యలున్నాయి. ఒకటి పార్టీలో నేతల మధ్య కీచులాటలు. రెండు తెరాస ఆకర్ష కారణంగా పార్టీ ఖాళీ అయిపోతుండటం. వీటిలో మొదటి సమస్య పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉంది కనుక దానికి తాత్కాలిక పరిష్కారాలే తప్ప శాశ్విత పరిష్కారాలు కనుగొనడం అసంభవం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని దశాబ్దాలుగా అదేవిధంగా ముందుకు సాగిపోతోంది కనుక ఇప్పుడూ ఈ సమస్యను దిగ్విజయ్ సింగ్ అదేవిధంగా పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు.
సాధారణంగా ఏ పార్టీ అయినా నేతల కారణంగానే దెబ్బ తింటుంది తప్ప కార్యకర్తల వలన కాదు. కనుక పార్టీ తరపున ముందు నేతలు గట్టిగా నిలబడి మాట్లాడగలిగితే పార్టీ కార్యకర్తల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కనుక నేడు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దిగ్విజయ్ సింగ్ అందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. టీ-కాంగ్రెస్ నేతలపై తెరాస ప్రయోగిస్తున్న ఆకర్ష మంత్రాన్ని త్రిప్పికొట్టడానికి, తెరాస ప్రభుత్వంపై ఉదృతంగా పోరాటాలు చేయడం తప్ప వేరే మరే మార్గాలు లేవనే చెప్పవచ్చు. కనుక ఈ సమావేశంలో టీ-కాంగ్రెస్ కార్యాచరణని రూపొందించుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. పార్టీ నేతలు కలిసికట్టుగా పోరాడితే పార్టీ నేతల మద్య పరస్పర అవగాహన, ఐకమత్యం పెరిగి తెరాస ఆకర్షకి లొంగిపోకుండా నిలబడగలుగుతారు.
ఇటీవల ప్రకటించిన పార్టీ జంబో కార్యవర్గ కమిటీలలో సభ్యుల మద్య సమన్వయం లోపించినట్లు పాలేరు ఉపఎన్నికలలో చాలా స్పష్టంగా కనబడింది. కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడానికి మంచి అవకాశం ఉన్న పాలేరు ఉపఎన్నికల ప్రచారానికి పార్టీలో సీనియర్ నేతలు చాలా మంది మొహం చాటేశారు. బహుశః దానిపై కూడా నేటి సమావేశంలో వాడివేడిగా వాదోపవాదాలు జరుగవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటివన్నీ చాలా సర్వసాధారణమయిన విషయాలే.
ఇప్పటికే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. అందుకు చాలా బలమైన కారణం ఉంది కనుక విచారించి ప్రయోజనం లేదు. కానీ తెలంగాణాలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా నిలవగలిగే శక్తి, సామర్ధ్యాలున్నప్పటికీ తెరాస ధాటికి తట్టుకోలేక దాసోహం అనడమే కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దిగ్విజయ్ సింగ్ ని పంపించింది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కాలమే చెప్పాలి.