తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన జేయేసిని రాజకీయ పార్టీగా మార్చి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నారా? తెలంగాణా ఉద్యమ సమయంలో భుజంభుజం కలిపి పోరాడిన తెరాసని, దాని అధ్యక్షుడు కేసీఆర్ ని డ్డీ కొనబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆయన విదేశాలలో పర్యటించి వచ్చిన తరువాత చాలా మంది ప్రవాస తెలంగాణా పౌరులు తెలంగాణా రాజకీయ జేయేసిని రాజకీయ పార్టీగా మార్చి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని కోరుకొన్నారని మీడియాకి చెప్పారు. దానిపై జెయేసిలో చర్చించినపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. తెలంగాణా విద్యావంతుల వేదిక అధ్వర్యంలో “తెలంగాణా-ప్రజల ఆకాంక్షలు-ప్రభుత్వ తీరు తెన్నులు” అనే అంశం నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక సదస్సు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడిన మాటలు విన్నట్లయితే ఆయన తెలంగాణా రాజకీయ జేయేసిని రాజకీయపార్టీగా మార్చి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నట్లే కనిపిస్తోంది.
“ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెరాస పాలన సాగడం లేదు. దాని రెండేళ్ళ పాలనలో ఆశించిన ఫలితాలేవీ రాకపోవడం మాకు చాలా నిరాశ కలిగిస్తోంది. వ్యవసాయం, కులవృత్తుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ప్రజలందరికీ జీవనోపాధి కల్పించే ప్రయత్నాలు జరుగనేలేదు. తెరాస రెండేళ్ళ పాలన మాకు చాలా నిరాశ, తీవ్ర అసంతృప్తి కలిగించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణా రాష్ట్రాభివృద్ధి జరగడం లేదు. ఒకవేళ మీకు చాతకాకపోతే తప్పుకోండి. మేమే అభివృద్ధి చేసి చూపిస్తాము. ఏదో విధంగా ప్రజలకి మేలు చేయాలనే తాపత్రయం మాకు ఉన్నందునే ఇంకా ఈ రాజకీయ జేయేసిని కొనసాగిస్తున్నాము. లేకుంటే దీనిని ఎప్పుడో ఏదో ఒక రాజకీయ పార్టీలో విలీనం చేసేసి, దాని వెనుక తిరిగి ఉండేవాళ్ళం. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని మనం పోరాడి సాధించుకొన్నాము. తెలంగాణా ఏర్పడింది కానీ దాని ఆశయసాధన మాత్రం జరగడం లేదు,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
తెలంగాణాలో తమ పార్టీకి ఎదురే ఉండకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండేళ్ళలో రాష్ట్రంలో ప్రతిపక్షలన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. దానికి బంగారి తెలంగాణా కోసం ‘రాజకీయ పునరేకీకరణ’ అనే అందమైన ముసుగు తొడిగారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్న సమయంలో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణా రాజకీయ జేయేసి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి తెరాసకు సవాలు విసిరితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక దానిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు. కొమ్ములు తిరిగిన తెదేపా, కాంగ్రెస్, భాజపాలే తెరాస ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నప్పుడు, తెరాసని డ్డీ కొనడం ప్రొఫెసర్ కోదండరాం వలన సాధ్యం అవుతుందా? ఒకవేళ తెలంగాణా రాజకీయ జేయేసిని రాజకీయ పార్టీగా మార్చి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తెలంగాణా ప్రజలు ఆదరిస్తారా? ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోంటారా? అనే అనుమానాలున్నాయి.