తెలంగాణా తెదేపాకి ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఊహించని షాక్ ఇచ్చారు. శాసనసభలో తెదేపా వాడుకొంటున్న 107, 110 నెంబర్లు గల రెండు గదులని మహిళా సంక్షేమ శాఖా కమిటీ, మైనార్టీ సంక్షేమ అసోసియేషన్ లకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ విషయం తెదేపాకి మాట మాత్రంగా కూడా చెప్పలేదు. తము వాడుకొంటున్న ఆ రెండు గదులని వేరే వాళ్లకి కేటాయించినట్లు తెలియగానే తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వంపై, స్పీకర్ పై మండిపడ్డారు. స్పీకర్ తెరాస ప్రతినిధిలాగ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం తమని అవమానించేందుకే ఈవిధంగా చేసిందని అన్నారు. తాము ఆ రెండు గదులను ఖాళీ చేయకుండా, వాటిని వేరొకరికి ఏవిధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. స్పీకర్ తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకాకపోతే ఆయన నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తానని చెప్పారు.
తెలంగాణా శాసనసభ స్పీకర్ తెదేపాకి షాక్ ఇస్తే, తెదేపా కూడా తెరాసకి షాక్ ఇవ్వడానికి పావులు కదుపుతోంది. తెరాసలో చేరిన తెదేపా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నేటికీ ఏపికి చెందిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ని వాడుకొంటున్నారు. ఆయనని తక్షణమే ఖాళీ చేయించాలని రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుని కోరారు. బహుశః ఆయన కూడా ఎర్రబెల్లికి కేటాయించిన నివాసాన్ని వేరొకరికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇస్తారేమో?
రాజకీయపార్టీలే ప్రభుత్వాలు నడుపుతున్నప్పటికీ ఆ రెంటి మద్య సన్నటి గీత ఉన్నట్లయితే స్పీకర్ అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించగలుగుతారు. అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటాయి. ఆ పరిస్థితి ఉంటే నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో అంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించే ధైర్యం చేసేవారే కాదు. ఒకవేళ చేసినా వారిపై అనర్హత వేటు పడి ఉండేది. కానీ ఆ విధంగా జరగడం లేదంటే స్పీకర్లు అధికార పార్టీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దాని విశాపరినామాలు ఎప్పుడూ ఈవిధంగానే ఉంటాయి తప్ప మరోలా ఉండవు.