తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కదలిక వచ్చింది. అయితే ప్రభుత్వంపై పోరాడి.. ఏదో బలపడిపోదామన్న ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ దిశగా మందడుగు వేయడంలో ఈ కదలిక రాలేదు.. తమలో తాము కలహించుకుంటూ… తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చాలంటూ..వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడమే కాదు.. ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేశారు. గ్రేటర్ ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగనున్నాయి. ఎవరు ఔనన్నా..కాదన్నా.. తెలుగుదేశం పార్టీ ప్రభావనీయమైన పార్టీనే. అందుకే.. హఠాత్తుగా.. టీటీడీపీ నేతలు కొత్త నాయకత్వం కావాలని పోరుబాట ప్రారంభించారు. ప్రస్తుతం ..తెలంగాణ టీడీపీకి ఎల్.రమణ అధ్యక్షుడిగా ఉన్నారు.
కారణాలేవి అయితేనేం ఆయన చురుగ్గా లేరు. దీంతో ..టీడీపీ కార్యకలాపాలు చేట్టేవారు కరవయ్యారు. దీంతో ఆయనను తప్పించాలని.. టీటీడీపీలో భవిష్యత్ వెదుక్కుంటున్న నేతలు అధ్యక్షుడిని కోరుతున్నారు. ఎల్.రమణ తెలంగాణ ఏర్పడినప్పటి నుండి టీీపీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. ఎర్రబెల్లి నుంచి రేవంత్ రెడ్డి వరకూ పలువురు పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే.. వారు పార్టీ వీడాలనుకుని… రమణను కారణంగా చూపించారన్న చర్చ కూడా ఉంది. అందుకే చంద్రబాబు రమణపైనే నమ్మకం పెట్టుకున్నారు. పొత్తుల కోసం గత ముందస్తు ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయలేదు. టిక్కెట్ కూడా త్యాగం చేశారు. అయితే అప్పుడు ఆయన తీరుపై కొంత మంది నేతలు విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడు మిగతా వారు కూడా బయటపడుతున్నారు. ఏడేళ్లుగా ఒక్కరే అధ్యక్షుడిగా ఉండటంతో.. పార్టీ పరిస్థితి దిగజారుతోదంటోన్న పలువురు నాయకులు ఆవేదన చెందుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోపు కొత్త అధ్యక్షుడి నియమించాలని కోరుతున్నారు. అలాగే పార్టీకి కింది స్థాయి నుంచి నాయకత్వాన్ని కొత్తగా నియమించాలని కోరుతున్నారు. మరి రమణ కాకుండా..ఇక గుర్తింపు ఉన్న ప్రముఖ నేత ప్రస్తుతానికి టీటీడీపీలో ఎవరూలేరు. చంద్రబాబు కొత్తగా ఆలోచించాల్సిందే.