తెలంగాణాలో తెదేపా నేతలెవరు? అని అడిగితే అందరూ రేవంత్ రెడ్డి పేరే ముందు చెప్తారు తప్ప పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అని చెప్పరు. కారణం ఆయన రేవంత్ రెడ్డి అంత చురుకుగా వ్యవహరించకపోవడమే. కానీ దానిపై ఆయనకి వేరే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి తను అధ్యక్షుడయినా రేవంత్ రెడ్డి పెత్తనం ఎక్కువయిపోయిందని, తనను సంప్రదించకుండానే ఆయన చాలా నిర్ణయాలు తీసుకొంటున్నారని, చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డినే వెనకేసుకొని వస్తుండటంతో తను పేరుకే పార్టీ అధ్యక్షుడిగా మిగిలిపోయానని ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకుపోతున్నా కూడా చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకపోవడంతో ఇంక పార్టీకి భవిష్యత్ లేదని, కనుక తెరాసలో చేరడం తప్ప వేరే దారి లేదని భావిస్తున్న రమణ తెరాసలో చేరేందుకు మంత్రి హరీష్ రావుతో మాట్లాడారని తాజా సమాచారం. తనపై మీడియాలో ఇటువంటి వార్త వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా ఖండించాల్సి ఉంటుంది లేకుంటే వాటిని దృవీకరిస్తున్నట్లే భావించవలసి ఉంటుంది. ఈ విషయాన్నీ సాక్షి మీడియా బయటపెట్టింది కనుక అది నిజమో కాదో స్వయంగా ఆయనే స్పందిస్తే తప్ప స్పష్టం కాదు.